కరోనా వేళ… తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల అల్టిమేటం…
- డిమాండ్ల పరిష్కారానికి జూడాల సమ్మె బాట
- రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలని స్పష్టీకరణ
- 15 శాతం జీతం పెంచాలని డిమాండ్
- ఇన్సెంటివ్స్ కూడా పెంచాలంటున్న వైనం
ప్రాణాంతక కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్య సిబ్బంది సేవలు ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కీలక సమయంలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధం కావడం ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే సమ్మె తప్పదని జూడాలు తెలంగాణ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు.
రెండు వారాల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 శాతం జీతం పెంచాలని, 10 శాతం ఇన్సెంటివ్స్ చెల్లించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.