కేంద్ర ప్రభుత్వ విధానాలపై ‘ప్రజాగర్జన‘
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ‘ప్రజాగర్జన‘
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త జాతాలు
మార్చి 17న హన్మకొండలో ప్రారంభం
మూడు బృందాలుగా కొనసాగనున్న యాత్రలు
సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య, జాన్ వెస్లీల సారథ్యం
ఖమ్మంలో ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల పార్టీ సమావేశంలో వివరాలు వెల్లడించిన తమ్మినేని వీరభద్రం
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ (ఎం) జాతీయ కమిటీ పిలుపుమేరకు మార్చి 17వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రలు ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మూడు బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలకు తనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, జాన్ వెస్లీ సారథ్యం వహిస్తారని వివరించారు. కార్పొరేట్ తొత్తుగా మారిన బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన పార్టీ ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మార్చి 17న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సారథ్యంలో హనుమకొండలో ప్రారంభమయ్యే యాత్రను జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమయ్యే యాత్రకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, నాగర్ కర్నూల్ నుంచి ప్రారంభమయ్యే యాత్రకు జాన్ వెస్లీ సారథ్యం వహిస్తారని వివరించారు. మూడు బృందాలుగా నిర్వహించే యాత్రలు మార్చి 30వ తేదీ నాటికి హైదరాబాదులోని తుర్కయంజాల్ ప్రాంతానికి చేరుకుంటాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే యాత్రల ప్రధాన ఉద్దేశంగా చెప్పారు. బిజెపి పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలపై విపరీతంగా పన్నుల భారం వేస్తూ.. కార్పొరేట్లకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటేటా దిగజారుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ స్పష్టం చేసిందని తెలిపారు. తొమ్మిది శాతంగా ఉన్న ఆర్థిక పురోభివృద్ధి క్రమేణా 7. 4% నుంచి ప్రస్తుతం 6. 8 శాతానికి దిగజారిందని, 2023- 24 నాటికి ఇది 6. 1% చేరుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తెలిపిందన్నారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతుందన్నారు. డిసెంబర్ నాటికి 8.96% గా ఉన్న పట్టణ నిరుద్యోగిత జనవరి నాటికి 10.,09 శాతానికి చేరిందన్నారు. గ్రామీణ నిరుద్యోగిత 7.4% నుంచి 7. 5 శాతానికి చేరిందని చెప్పారు. గ్రామీణ నిరుద్యోగితను పరిష్కరించే ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కు ఏటా రెండు లక్షల కోట్ల కేటాయింపులు పెంచాల్సి ఉండగా… తగ్గిస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశంలో కార్పొరేట్ల ఆస్తులు విచ్చలవిడిగా పెరుగుతుండగా ప్రజల జీవన ప్రమాణాలు నానాటికి దిగజారుతున్నాయని పేర్కొన్నారు. హెడేన్ బర్గ్ పరిశోధన ప్రకారం అదాని గ్రూపు ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఈ గ్రూపుకు అప్పగిస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. మొన్నటి బడ్జెట్లో వ్యవసాయ, ఉపాధి హామీ, విద్యారంగం కేటాయింపులు గణనీయంగా తగ్గాయన్నారు. ఎరువుల సబ్సిడీపై కోత విధించారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, గవర్నర్లు బిజెపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని అన్నారు. చివరకు న్యాయవ్యవస్థలో సైతం బిజెపి జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. ప్రజా గర్జన యాత్రలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల్లో యాత్రలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. యాత్రల్లో భాగంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, సభలు ఉంటాయని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ నాయకులు సైతం ఈ సభల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ ఉమ్మడి నాలుగు జిల్లాల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, సాదుల శ్రీనివాస్, చక్రపాణి, బండి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.