మలబద్ధకం వేధిస్తుందా..? దాని వెనుక రిస్క్ ఉంది..!
- జీర్ణ సంబంధిత సమస్యలు కారణం కావచ్చు
- మధుమేహం, కొలన్ కేన్సర్ లోనూ మలబద్ధకం
- కడుపు నొప్పి, ఆకలి తగ్గడం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి
తీవ్ర మలబద్ధకం, కడుపులో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. వాటి వెనుక ఎన్నో కారణాలు, ఇతర వ్యాధులు ఉండొచ్చు. మనం తిన్న ఆహారం జీర్ణమై, అందులోని పోషకాలను గ్రహించిన తర్వాత, వ్యర్థాన్ని పేగులు బయటకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ ఎప్పుడూ సాఫీగా సాగిపోవాలి. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. కానీ, మలబద్ధకం సమస్యలో వ్యర్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ మందగిస్తుంది. దీనివల్ల వచ్చే అదనపు సమస్యలు కూడా ఉన్నాయి.
మన దేశంలో 18 శాతం జనాభా ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గ్యాస్ట్రైటిస్ కావచ్చు. లేదంటే నరాల సంబంధిత సమస్యలు కావచ్చు. తీసుకునే ఆహారంలో పీచు లేకపోవచ్చు. కనుక కారణాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
మధుమేహం
మధుమేహం వల్ల శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణలో ఉండదు. నియంత్రణలో లేని గ్లూకోజ్ వల్ల గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా దీనివల్ల పొత్తి కడుపు, పేగుల్లో నరాలు దెబ్బతింటాయి. తిన్న ఆహారం జీర్ణమై బయటకు వెళ్లడానికి మార్గం చూపించే పేగులపై ఈ ఒత్తిడి పడి నొప్పి, మలబద్ధకానికి దారితీస్తుంది.
అపెండిసైటిస్
అపెండిక్స్ లో వాపునే అపెండిసైటిస్ గా చెబుతారు. కడుపులో నొప్పి, తల తిరగడం, ఆకలి తగ్గడం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు దీని లక్షణాలు.
హైపో థైరాయిజం
కావాల్సిన దానికంటే థైరాయిడ్ హార్మోన్ తగ్గడాన్ని హైపో థైరాయిజంగా చెబుతారు. దీనివల్ల పేగుల కదలికలు తగ్గుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా మలబద్ధకం సమస్య వేధిస్తుంది. బలహీనత, అయోమయం కూడా కనిపిస్తాయి.
నాడీ సంబంధిత రుగ్మతలు
వెన్నెముకకు గాయాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్ సన్స్ వ్యాధుల్లోనూ మలబద్ధకం కనిపిస్తుంది.
కొలన్ కేన్సర్
మలబద్ధకానికి తోడు, బరువు తగ్గిపోతే, ఆకలి కోల్పోతే, మలంలో రక్తం కనిపిస్తే కొలన్ కేన్సర్ గా అనుమానించొచ్చు.
పాంక్రియాటైటిస్
పాంక్రియాస్ వాపు వల్ల సిస్ట్ లు ఏర్పడడం లేదంటే అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. కడుపులో నొప్పి మొదలై వెనక్కి తన్నుతుంది.
గ్యాస్ట్రో పారెసిస్
ఈ సమస్యలోనూ మలబద్ధకం కనిపిస్తుంది. మధుమేహుల్లో ఇది ఎక్కువగా వస్తుంది.
ఇక్కడ చెప్పుకున్న సమస్యలన్నీ కూడా చికిత్స తీసుకోకపోతే పెరిగిపోయేవే. వీటివల్ల ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక ఏది కనిపించినా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం.