టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత!
- గత జనవరిలో బచ్చుల అర్జునుడికి గుండెపోటు
- రమేశ్ ఆసుపత్రిలో చికిత్స
- స్టెంట్ వేసిన వైద్యులు
- గత కొన్నిరోజులుగా పరిస్థితి విషమం
టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈ సాయంత్రం కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
బచ్చుల అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. జనవరి 28న ఆయన గుండెపోటుతో కుప్పకూలగా, విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టెంట్ అమర్చారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించినట్టు భావిస్తున్నారు.
బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందినవారు. ఆయన బందరు మున్సిపల్ చైర్మన్ గా ప్రస్థానం ఆరంభించారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా కూడా అర్జునుడు పనిచేశారు. ఆయన 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
బచ్చుల అర్జునుడు మృతిపై చంద్రబాబు, లోకేశ్ స్పందన
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని తెలిపారు. అర్జునుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
అటు, యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందిన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు.
నిజాయతీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు. ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్మృతిలో నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు.