చట్టసభలు యుద్ధ భూములుగా మారుతున్నాయి..: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య…
- రాజకీయ నాయకులపై ప్రజల్లో గౌరవం, విశ్వాసం తగ్గుతున్నాయన్న వెంకయ్య
- యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
- బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైనదని వ్యాఖ్య
బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైనదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజల్లో రాజకీయ నాయకులపై గౌరవం, విశ్వాసం తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన చట్టసభలు యుద్ధ భూములుగా మారుతున్నాయని విమర్శించారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. హనుమకొండలో నిర్వహించిన చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘‘ఇంగ్లిష్ భాష నేర్చుకోవాలి. తప్పు కాదు.. కానీ ఆంగ్ల సంస్కృతులు మాత్రం నేర్చుకోవద్దు. పరభాషా వ్యామోహంలో మాతృ భాష, సంస్కృతిని మర్చిపోవద్దు. మాతృభాషలో ప్రాథమిక విద్య, పరిపాలన ఉండాలి’’ అని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లు ఎవరైనా సరే తెలుగులోనే మాట్లాడాలని వెంకయ్య కోరారు. కుల మతాల పేరుతో కొన్ని రాజకీయ శక్తులు మనుషుల మధ్య ద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు.
విద్య వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. ‘‘ఎడ్యుకేషన్ ఒక మిషన్. కమీషన్ కాకూడదు’’ అని చెప్పారు. సమాజంతో సంబంధం లేకుండా క్లాస్ రూమ్ లో నాలుగు గోడల మధ్యే విద్యను నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. సమాజంతో కలిసి జర్నీ చేయకపోవడమే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని, సెల్ ఫోన్ కు బానిసలై సమయాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.