బద్దలైన పైప్‌లైన్.. రోడ్డు ఎలా ముక్కలైందో చూడండి!
- మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఘటన
- పైప్‌లైన్ బద్దలై అమాంతం ఎగజిమ్మిన రోడ్డు
- అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మహిళకు గాయాలు
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఓ పైప్‌లైన్ బద్దలై రోడ్డు ముక్కలైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో అటువైపుగా స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ బయటకు ఎగజిమ్మిన భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. విదర్భ హౌసింగ్ సొసైటీలో జరిగిందీ ఘటన.
పైప్‌లైన్ ఒక్కసారిగా బద్దలుకావడంతో రోడ్డు పగిలిపోయి నీరు బలంగా పైకి ఎగజిమ్మింది. పైప్‌లైన్ బద్దలైన వేగానికి పైన రోడ్డు ముక్కలైంది. అదే సమయంలో అటు నుంచి స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ ఆ భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి గాయపడింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను ఫోన్‌లో మాట్లాడుతున్నానని, ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షి పూజా బిశ్వాస్ తెలిపారు. నీటి ప్రవాహంలో చిక్కుకుని గాయపడిన మహిళను స్థానికులు రక్షించారు.
2020లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆసుపత్రి సీలింగ్‌పై ఏర్పాటు చేసిన పైప్‌లైన్ బద్దలు కావడంతో కొవిడ్ వార్డు నీటిలో మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని ఇట్టమడు మెయిన్ రోడ్డులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో సైక్లిస్ట్ ఒకరు గాయపడ్డారు.