రాష్ట్రంలో కేసులు తక్కువగా చూపిస్తున్నారు … రేవంత్ రెడ్డి…
-అందుకే కేంద్రం తక్కువ వ్యాక్సిన్లు పంపిస్తుందన్న రేవంత్
-తెలంగాణలో కరోనా కొత్త కేసుల బాగా తగ్గినట్లు చెబుతున్న సర్కార్
-కావాలనే చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి
-కరోనా వ్యాక్సిన్ తెలంగాణలోనే తయారవుతోందని వెల్లడి
-రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏంటని ఆగ్రహం
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు 4 వేలకు అటూఇటూగానే నమోదవుతున్నాయి. అయితే, కేసీఆర్ ప్రభుత్వం కావాలనే కరోనా కేసులను తక్కువగా చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దాంతో కేంద్రం కూడా తక్కువ సంఖ్యలో ఔషధాలను, వ్యాక్సిన్లను పంపుతోందని అన్నారు. అసలు, కరోనా వ్యాక్సిన్ (కొవాగ్జిన్) తయావుతోందే తెలంగాణలో అని, అలాంటిది రాష్ట్రంలో వ్యాక్సిన్ లభ్యం కాకపోవడం ఏంటని ధ్వజమెత్తారు.
తెలంగాణ వ్యాక్సిన్ అవసరాలు తీరిన తర్వాతే బయటి రాష్ట్రాలకు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు తమ అవసరాలు తీరిన తర్వాతే ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నప్పుడు, కేసీఆర్ వ్యాక్సిన్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
దేశంలో రెండు కంపెనీలకే వ్యాక్సిన్ అనుమతులు ఉంటే, తెలంగాణ సర్కారు గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించడంలో అంతరార్థం ఏమిటని అన్నారు. కొనుగోళ్లు అనగానే కేటీఆర్ రంగప్రవేశం చేశారని, ఇక కేటాయింపులు అంటే కేటీఆర్ కు జతగా హరీశ్ రావు కూడా వచ్చేస్తారని రేవంత్ విమర్శించారు. దోపిడీకి వీలయ్యే ఏ శాఖ అయినా కేసీఆర్ కుటుంబం వద్దే ఉంటుందని ఆరోపించారు.
“కరోనా అంశాలపై కేసీఆర్ సలహాలు విని ప్రధాని మోదీ మెచ్చుకున్నారని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇంకా నయం, ఢిల్లీకి పిలిపించి సన్మానం చేస్తామంటున్నారని కేసీఆర్ చెప్పుకోలేదు” అని వ్యంగ్యంగా అన్నారు.