Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వారెంట్ లేకుండా నాన్నను అరెస్ట్ చేశారు… రఘురామ తనయుడు భరత్…

వారెంట్ లేకుండా నాన్నను అరెస్ట్ చేశారు… రఘురామ తనయుడు భరత్…
ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు:
రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
వాహనంలో తరలింపు
అన్యాయంగా తీసుకెళ్లారన్న భరత్
అధికారం ఉంటే ఏమైనా చేస్తారా అంటూ ఆక్రోశం
తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని ఆవేదన
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును కొద్దిసేపటి కిందట ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ స్పందించారు.

వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్ కు కారణాలు చూపలేదని, తాము అడిగితే కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు సమాధానమిచ్చారని భరత్ వెల్లడించారు. “పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు, మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం చేతిలో ఉంది కదా అని ఏమైనా చేస్తారా? అని ఆక్రోశించారు. కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తన తండ్రికి ఆరోగ్యం కూడా బాగాలేదని భరత్ వాపోయారు. ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది మూడు నెలల కిందటేనని వెల్లడించారు. తమ ఇంటికి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులా, రౌడీలా అనేది అర్థంకాలేదని అన్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే వచ్చి, అకస్మాత్తుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ అరెస్ట్ అన్యాయం అని, కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

కాగా, రఘురామకృష్ణరాజుపై 124/ఏ, 153/బీ, 505 ఐపీసీ, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. సెక్షన్ 50 కింద రఘురామ భార్య రమాదేవికి సీఐడీ నోటీసులు ఇచ్చింది.

 

రఘురామది అక్రమ అరెస్టు : అచ్చెన్నాయుడు

  • ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అరెస్ట్ చేశారు
    -వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడమా ? ఇదెక్కడి న్యాయం
    -‘రూల్ ఆఫ్ లా’ను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం
    -జగన్ దమనకాండకు నిదర్శనమని వ్యాఖ్యలు
    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అరెస్ట్ చేయడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని అన్నారు. రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు . ఇది జగన్ వికృత చేష్టలకు దమనకాండకు నిదర్శనమని మండిపడ్డారు.

‘రూల్ ఆఫ్ లా’ను నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వారెంట్ లేకుండా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడం అక్రమం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన ప్రత్యర్థులపై జగన్ చేస్తున్న దమనకాండకు ఇదొక నిదర్శనం అని తెలిపారు.

ఈ సాయంత్రం హైడ్రామా నడుమ హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. రఘురామ కుటుంబ సభ్యులకు నోటీసులు అందించిన సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసి విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Related posts

రిమోట్ ఓటింగ్ మిషన్ పై ముగిసిన అఖిలపక్ష సమావేశం!

Drukpadam

చంద్రబాబును జైల్లో పెట్టడం జగన్ కు నష్టం: ప్రొఫెసర్ హరగోపాల్

Ram Narayana

హుజురాబాద్ అసెంబ్లీ పై చకా చకా ఫైల్ …ఖాళీ అయినట్లు ఈసీకి సమాచారం

Drukpadam

Leave a Comment