ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ…
ఈ సాయంత్రం హైదరాబాదులో రఘురామ అరెస్ట్
విజయవాడ తరలింపు
సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటన
ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయిందని వెల్లడి
ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని అభియోగం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఏపీసీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ అరెస్టును ఏపీసీఐడీ ధ్రువీకరించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటన వెలువడింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజుపై అభియోగాలు మోపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని ఏపీ సీఐడీ వెల్లడించింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా?: అయ్యన్న
హైదరాబాదులో ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
విజయవాడ తరలిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు
అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయన్న అయ్యన్న
కోర్టులకు శని, ఆదివారాలు సెలవులని వెల్లడి
బెయిల్ రాకుండా చేసేందుకేనని వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రఘురామను సీఐడీ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రాణాలు పోతున్న రోగులను తెలంగాణ సరిహద్దుల వద్ద ఆపుతున్నారు కానీ, ఏపీ సీఐడీ పోలీసులను మాత్రం ఆపడంలేదు… ఆ రహస్యం ఏమిటో? అని సందేహం వ్యక్తం చేశారు.
“వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వారి అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయి. కూల్చివేతల ముహూర్తం శనివారం తెల్లవారుజామునే ఉంటుంది. కోర్టులకు శని, ఆదివారాలు సెలవు కాబట్టి బెయిళ్లు, స్టేలు రాకుండా ఉండేందుకు ఆ రోజులను ఎంచుకుంటున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదా?” అని అయ్యన్న వ్యాఖ్యానించారు. దీనిపైనా కోర్ట్ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుంది మరి!