జర్నలిస్టులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి… లోకేశ్ కు వినతిపత్రం సమర్పించిన ఏపీయూడబ్ల్యూజే….
- కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ ను కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు
- తమ విజ్ఞప్తులను లోకేశ్ కు వివరించిన జర్నలిస్టులు
- టీడీపీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చాలని వినతి
- సానుకూలంగా స్పందించిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా, ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) సంఘ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్.ఎన్.ఐ కలిగిన ప్రతి పత్రిక, అర్హత ఉన్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులివ్వాలని కోరారు. జర్నలిస్టుల హెల్త్, ఇన్సూరెన్స్ స్కీమ్ లను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
“అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. తెలంగాణ తరహాలో కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందించాలి. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలి. తమిళనాడు, బీహార్ రాష్ట్రాల తరహాలో 55 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలి.
కర్నూలులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో మట్టి తవ్వకాలను నిలిపి వేయాలి. జర్నలిస్టుల స్థలాల్లో రోడ్లు,మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. కరోనాబారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలి” అని తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.
అందుకు నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ తమ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టే మీడియాపై విషం కక్కుతున్నారని విమర్శించారు. తమకు అనుకూలంగా లేని చానళ్ల సిగ్నల్స్ కట్ చేయడం, పత్రికలకు అక్రిడిటేషన్లు నిలిపేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
“జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. కర్నూలులో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేయడం దారుణం. టీడీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల సమస్యలపై సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం. జర్నలిస్టులకు గతంలో మాదిరిగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు.