Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..

మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..

ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ మనసుకు ఏదీ తట్టదు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. ఎందుకిలా..? మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే.. మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. మెదడు పనితీరు సమర్థవంతంగా ఉండడానికి తోడ్పడే పది అంశాలేమిటో తేల్చారు. వాటి గురించి తెలుసుకుందాం..
1. రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం
మెదడు చురుగ్గా ఉండడానికి.. శారీరక శ్రమకు, వ్యాయామానికి ఏమిటి సంబంధం అనుకోవద్దు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. శారీరక శ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి.. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శారీరకంగా ఫిట్ గా ఉంటే మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుందని గుర్తించారు. శరీరంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి.. మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని వారు చెబుతున్నారు.
‘‘వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తి (రక్తంలోని గ్లూకోజ్)లో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు (న్యూరాన్లు) అత్యంత సున్నితమైనవి. వాటికి కనీసం ఒకటి రెండు నిమిషాలు శక్తి అందకపోయినా దెబ్బతింటాయి. కానీ శరీర వ్యవస్థ మొత్తం మెదడుకు పూర్తిస్థాయి రక్షణ, ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందించబడి ఉంటుంది. దాంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి. ఇదే సమయంలో ఇతర అవయవాలకు శక్తి రవాణాను తగ్గించి.. మెదడుకు అందిస్తాయి. దాంతో మెదడు మరింత శక్తిని పుంజుకుంటుంది..’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఫెర్నాండో గొమెజ్ వెల్లడించారు.
అయితే ఇది కొంత సమయం వరకు అంటే రోజూ 30 నిమిషాలు లేదా గంట వరకు మాత్రమే పనిచేస్తుందని.. దీర్ఘకాలం పాటు గ్లూకోజ్ తక్కువగా అందితే మెదడు పనితీరు దెబ్బతింటుందని హెచ్చరించారు.
2. కడుపు మాడ్చుకోవద్దు..
మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతం వరకు మాత్రమే ఉంటుంది.. కానీ అది వినియోగించుకునే శక్తి ఏకంగా 20 శాతం. శరీరంలో అధికంగా గ్లూకోజ్ ఉండడం లేదా అతి తక్కువగా ఉంటుండడం వంటివి మెదడులోని సున్నితమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయని ఇంగ్లాండ్ కు చెందిన రోహంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని, దానివల్ల మెదడులో కీలకమైన ‘ఫ్రంటల్ కార్టెక్స్’ భాగం పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని గుర్తించినట్లు వారు చెబుతున్నారు. అందువల్లే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు ఏదైనా విషయంపై దృష్టి సారించలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, గందరగోళ పడడం వంటివి తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.
ఇక ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా తక్కువగా ఉండకుండా ఉండాలంటే.. ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
3. ఆహారంలో సమతుల్యత ముఖ్యం
మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇందులోనూ కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని.. ప్రొటీన్లు మాత్రం అవసరమైన తప్పనిసరిగా శరీరానికి అందాలని చెబుతున్నారు. ఇలాంటి ఆహార అలవాట్ల వల్ల దీర్ఘకాలికంగా మేలు చేస్తుందని, మెదడు పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు.
ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలని, ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్ వీలైనంత తక్కువగా ఉండాలని బ్రిటన్ కు చెందిన ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ గ్రీన్ చెబుతున్నారు. శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో దీర్ఘకాలంలో మెదడు సామర్థ్యం తగ్గిపోయినట్లుగా తమ అధ్యయనంలో గుర్తించామని వెల్లడించారు.
ఆహారంలో అధిక కొవ్వుల కారణంగా మెదడులో జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానమైన హిప్పో కాంపస్ భాగం పనితీరు దెబ్బతింటుందని మైఖేల్ గ్రీన్ పేర్కొన్నారు. అయితే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు మాత్రం మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలకు ఇది బాగా అవసరమని తెలిపారు.
4. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..
మనం శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉంటే.. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏదైనా వ్యాధులు, జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. అది మెదడుపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పట్టిపీడించే టైప్-2 మధుమేహం, ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటివి మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయి. వాటి వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఆలోచించే శక్తి, విశ్లేషణా సామర్థ్యం కూడా తగ్గిపోతాయి.
మధుమేహం, ఊబకాయం సమస్యలు ఉన్న వారికి శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక ధూమపానం, ఆల్కాహాల్ వంటి అలవాట్ల కారణంగా.. శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడం, అవి మెదడు పనితీరును దెబ్బతీయడం జరుగుతుంది. అందువల్ల పొగతాగడానికి, ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి.
5. తగినంత, సరైన నిద్ర, విశ్రాంతి అవసరం
మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. నిద్ర కూడా కలత నిద్ర, మగతగా నిద్రించడం వంటివి కాకుండా పూర్తిస్థాయి గాఢ నిద్ర ఉండాలి. మొత్తంగా రోజుకు కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని.. పని మధ్యలోనూ అప్పుడప్పుడు పది పదిహేను నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.మనం మెలకువతో ఉన్నంత సేపూ మనం చూస్తున్న, వింటున్న, అనుభూతి చెందుతున్న ప్రతి జ్ఞాపకం మెదడులో చేరుతుంది. వాటిని మెదడు ప్రాసెస్ చేస్తూ.. తదనుగుణంగా శరీర అవయవాలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మెదడులో కొన్ని రకాల ప్రొటీన్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎక్కువసేపు నిద్రపోకుండా ఉంటే ఆ ప్రొటీన్లు అలాగే మెదడులో పేరుకుపోతూనే ఉంటాయి. వాటివల్ల మనం దేనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోవడం, ఆలోచించలేకపోవడం, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం జరుగుతుంది. అదే మనం నిద్రపోతే.. మెదడుకు బయటి అంశాలను ప్రాసెస్ చేయాల్సిన భారం తగ్గిపోతుంది. మెదడులో పేరుకుపోయిన ప్రొటీన్లు బయటికి వెళ్లిపోతాయి.
అయితే మనం నిద్రపోయినప్పుడు కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అప్పటివరకు జరిగిన, విన్న, చూసిన ఘటనలకు సంబంధించి సమాచారాన్ని నిద్రా సమయంలోనే విశ్లేషించుకుంటుంది. ప్రతి అంశాన్ని జ్ఞాపకంగా మార్చకుండా.. కొన్ని ఘటనలను తొలగించేస్తుంది. మరికొన్నింటిని తాత్కాలిక జ్ఞాపక శక్తిగా, మరికొన్నింటిని శాశ్వత జ్ఞాపకాలుగా మార్చి భద్రపరుస్తుంది. తద్వారా మెదడుపై భారం తగ్గిపోయి.. విశ్రాంతి స్థితికి వెళుతుంది. తిరిగి మనం నిద్ర లేచిన తర్వాత పూర్తి శక్తితో చురుగ్గా పనిచేస్తుంది.
తగినంత నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.
రోజు మధ్యలోనూ కొంతసేపు అంటే పది, పదిహేను నిమిషాల పాటు కునుకు తీస్తే.. మెదడులో ఏర్పడే ప్రొటీన్లు బయటికి వెళ్లిపోయి, కాస్త విశ్రాంతి లభించి తిరిగి చురుగ్గా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
నిత్యం ఏదో మనసులో పెట్టుకుని కలత నిద్ర పోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.
కనీసం ఆరు గంటల పాటు గాఢంగా నిద్రపోయే వారిలో జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం బాగా ఉంటుందని అమెరికన్ పరిశోధకులు తమ అధ్యయనాల్లో తేల్చారు.
6. మెదడును చురుగ్గా ఉంచే కాఫీ, టీ
సాధారణంగా మనం రోజూ కాఫీ, టీలను తాగుతూనే ఉంటాం. వీటివల్ల కొన్ని రకాల ప్రతికూల ప్రభావాలు ఉన్నా.. మెదడు విషయానికి వస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ మితంగా కాఫీని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడుగానీ, దేనిగురించైనా విశ్లేషించాల్సి వచ్చినప్పుడుగానీ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది.కాఫీ, టీలలో కెఫీన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కెఫైన్ తో పాటు ఉండే పలు రకాల యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు మెదడులో ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే ప్రొటీన్లను తొలగిస్తాయని.. తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీర్ఘకాలంలోనూ కాఫీ వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని, అల్జీమర్స్ (వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు) వ్యాధి వచ్చే అవకాశాలను ఇది 30 శాతం వరకు తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగవచ్చని.. అంతకు మించే మాత్రం ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు అధికమొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.
7. చేపలు తినండి
మనలో మెదడు చురుగ్గా పనిచేయడానికి చేప మాంసం అద్భుతంగా తోడ్పడుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయని, దెబ్బతిన్న నాడీవ్యవస్థను మరమ్మతు చేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి మానవ పరిణామ క్రమంలో మెదడు అభివృద్ధికి, ఆలోచనా, విశ్లేషణా శక్తి సమకూరడానికి ప్రధానంగా తోడ్పడింది చేప మాంసమేనని పరిశోధకులు ఒక విస్తృత అధ్యయనంలో ప్రాథమికంగా గుర్తించారు కూడా.
డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చేపలు తింటే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఒమేగా-3 సప్లిమెంట్లు (మాత్రలు) అందుబాటులో ఉన్నాయి. కానీ అలా కృత్రిమంగా రూపొందించిన వాటికన్నా ఆహారం రూపంలో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.
చేపలతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, గడ్డి తినే జంతువుల మాంసంలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.
8. సరదాగా గడపండి
నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఒత్తిడులు, అతిగా ఆలోచించడం కారణంగా మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో హానికర రసాయనాలు ఉత్పత్తి అవుతాయని.. అవి మెదడు పనితీరును మందగింపజేస్తాయని చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి మందగిస్తుందని, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల జీవన విధానంలో కొన్ని తప్పనిసరి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే యోగా, ధ్యానం వంటివాటిని రోజూ కొంతసేపు చేయాలి.
వారంలో ఒక రోజు పని ఒత్తిడులకు దూరంగా, రోజువారీ ఆలోచనలను వదిలివేసి సరదాగా గడపాలి.
వీలైతే మనకు ఇష్టమైన ఆటలపైగానీ, చిత్రలేఖనం వంటి వాటిపైగానీ దృష్టి పెట్టాలి. లేదా సంగీతం వినడం, సినిమాలు చూడడం వంటివీ చేయవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని గుర్తుచేసుకుంటూ.. దాని ద్వారా మరింత ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలి.
9. అనవసర మందులు, ఔషధాలకు దూరంగా ఉండండి
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి బ్రెయిన్ పిల్స్, మెమరీ బూస్టర్స్ అంటూ మార్కెట్లో వివిధ రకాల పేర్లతో ఎన్నో రకాల మందులు, ఔషధాలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఒమేగా-3 సప్లిమెంట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ల వంటి వాటిని జనం కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని పలు పరిశోధనల్లో వెల్లడైంది. శారీరకంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ఏదైనా జబ్బు, వ్యాధులకు లోనైనప్పుడు వైద్యులు సిఫారసు చేస్తే మాత్రమే అటువంటి సప్లిమెంట్లను వినియోగించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేకపోతే ఆ సప్లిమెంట్లతో ఎలాంటి ఫలితం లేకపోగా.. ఎన్నో దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్టులు) తలెత్తుతాయని, ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఏ రకమైన ప్రొటీన్లు, విటమిన్లు అయినా సహజ ఆహారం రూపంలో శరీరం సంగ్రహిస్తేనే ప్రభావవంతంగా పనిచేస్తాయని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.
అడ్డగోలుగా సప్లిమెంట్లను వినియోగించడం వల్ల అధిక రక్తపోటు, జీర్ణాశయ సమస్యలు, లైంగిక పటుత్వం కోల్పోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
10. మెదడుకు ‘పని’ పెట్టండి!
మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. దానికి కాస్త ‘పని’ పెట్టాలని శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల కిందటే గుర్తించారు. అక్షరాలను గళ్లలో పూరించే క్రాస్ వర్డ్ పజిల్స్, సూడోకు, జిగ్ సా పజిల్స్ వంటివాటిని పూరించడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది. వీటినే బ్రెయిన్ టీజర్లు అంటారు. అంటే మనం రెగ్యులర్ గా చేసే, ఆలోచించే పనులు కాకుండా.. మనలోని జ్ఞాపకశక్తి, విశ్లేషణాశక్తికి ఒకేసారి, ఒక క్రమ పద్ధతిలో వినియోగించే పజిళ్లు అన్నమాట. రోజు రోజుకూ కొత్త కొత్త పజిళ్లు పూరిస్తూ ఉంటే.. మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధానం బలంగా ఉంటుందని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగించే సమస్య తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
విద్యను అభ్యసించడం, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం వల్ల కూడా మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.
రోజూ కొత్త కొత్త పజిళ్లను, కాస్త క్లిష్టమైన పజిళ్లను పూరిస్తూ ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసుకు వచ్చినవారు ఇలా చేయడం వల్ల వారిలో అల్జీమర్స్ వంటివి వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.

Related posts

సీబీఐకి సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవం లేదు: వివేకా పీఏ కృష్ణారెడ్డి

Ram Narayana

ఈసీ సంచలన నిర్ణయం… సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు జాతీయ హోదా రద్దు

Drukpadam

ఆ నిర్ణయం తప్పే కానీ… ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న సుప్రీంకోర్టు

Drukpadam

Leave a Comment