లండన్ పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య యత్నం.. అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు..
- అమృత్ సర్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
- గత ఏడాదే అమృత్ పాల్ సింగ్, కిరణ్ దీప్ కౌర్ ల పెళ్లి
- పెళ్లి తర్వాత పంజాబ్ లోనే ఉంటున్న కిరణ్
ఖలిస్థాన్ మద్దతు ఉన్న రాడికల్ సిక్కు నేత అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య కిరణ్ దీప్ కౌర్ లండన్ కు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిస్ పంజాబ్ డీ సంస్థకు విదేశీ నిధులను సమకూర్చడంలో ఆమె కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో లండన్ వెళ్లేందుకు ఆమె అమృత్ సర్ విమనాశ్రయానికి వచ్చారు. ఇప్పటికే ఆమెపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎల్ఓసీ ని కూడా జారీ చేశారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోనే ప్రశ్నించారు.
వాస్తవానికి కిరణ్ దీప్ కౌర్ ఎన్నారై. ఆమె పంజాబ్ లో పుట్టినప్పటికీ ఆమె తల్లిదండ్రులు బ్రిటన్ లో స్థిరపడటంతో ఆమె అక్కడే పెరిగారు. అమృత్ పాల్ సింగ్ తో ఆమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి ఆమె పంజాబ్ లోనే ఉంటున్నారు.