Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్, కామ్రేడ్ల పొత్తు  కసరత్తు కొలిక్కి వచ్చేనా … …?

బీఆర్ యస్, కామ్రేడ్ల పొత్తు  కసరత్తు కొలిక్కి వచ్చేనా … …?
-కలిసి పనిచేద్దాం అంటూనే టికెట్స్ పై నాన్చుడు ధోరణి
-తమకు బలమున్న నియోజకవర్గాల్లో పోటీ ఖాయమంటున్న లెఫ్ట్ పార్టీలు
-పొత్తులు గౌరవ ప్రదంగా ఉండాలని కమ్యూనిస్టుల పట్టు
-పొత్తులో భాగంగా 10 నుంచి 13 సీట్లలో పోటీచేయాలనే యోచన
-వారికీ ఎమ్మెల్సీ లు ఇస్తే సరిపోతుందని బీఆర్ యస్ గుసగుసలు
-స్నేహపూర్వక పోటీ అంటూ కొత్త పల్లవి
-స్నేహపూర్వక పోటీకి లెఫ్ట్ పార్టీలు నో …అసెంబ్లీ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా కార్యాచరణ 
-బీఆర్ యస్ వైఖరిపై కమ్యూనిస్ట్ క్యాడర్ లో అసంతృప్తి
-ప్రత్యాన్మయం ఆలోచించాలని నాయకులపై వత్తిడి చేస్తున్న కార్యకర్తలు

దేశంలో  ముంచుకొస్తున్న బీజేపీ  ప్రమాదాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ తో కలిసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.. .మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్ యస్ అధినేత సీఎం కేసీఆర్ సిపిఐ, సిపిఎంల సహాయాన్ని కోరారు . కామ్రేడ్లు కూడా బీజేపీ మునుగోడు లో గెలిస్తే రాష్ట్రంలో పుంజుకుంటుందని, బీజేపీ లాంటి మతతత్వ పార్టీని రాకుండా నిరోదించాలంటే బీజేపీని బలంగా ఎదుర్కొనే శక్తి ఉన్న బీఆర్ యస్ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించుకున్నాయి. మునుగోడులో కమ్యూనిస్టుల సహాయంతోనే బీఆర్ యస్ గెలిచింది. ఈ విషయాన్నీ బీఆర్ యస్ కూడా అంగీకరించింది . సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి పార్టీ కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపింది. ముందు ,ముందు కూడా ఇదే స్నేహాన్ని కొనసాగిద్దమని స్వయంగా మంత్రులే చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి .కమ్యూనిస్టులతో పొత్తు ..పొత్తు అంటూనే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. మరో మాట కూడా వినిపిస్తుంది … స్నేహపూర్వక పోటీ అంటూ కొత్త పల్లవి లంకించుకున్నారు . దీనిపై వామపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి .ఉంటె పొత్తు లేకపోతె లేదు … స్నేహపూర్వక పోటీ అనేది ఉండదని కుండబద్దలు కొడుతున్నాయి. బీఆర్ యస్ ప్రతిపాదనలు నిజంగా అవే అయితే పొత్తు ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నాయి. ఈసారి తమ లక్ష్యం అసెంబ్లీ లో అడుగు పెట్టడమేనని అందుకు తగిన విధంగా రెండు పార్టీలు కలిసి ఆలోచన చేస్తాయని ఒక లెఫ్ట్ పార్టీ నాయకుడు స్పష్టం చేయడం గమనార్హం….

 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ యస్ ,కామ్రేడ్ల కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు . లెఫ్ట్ పార్టీల కార్యకర్తల్లో బీఆర్ యస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రయత్నించి పొత్తుల పట్ల సానుకూలత తీసుకోని వచ్చారు . కానీ బీఆర్ యస్ వైఖరి అందుకు అనుగుణంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కామ్రేడ్లతో బీఆర్ యస్ కు పొత్తు ఉంటుందా …? లేదా ….? అనే సందేహాలు నెలకొన్నాయి…

బీఆర్ యస్ పార్టీ కమ్యూనిస్టుల పై సానుకూలత వ్యక్తం చేస్తూనే సీట్లు కేటాయించే విషయంలో సన్నాయినొక్కులు నొక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న కామ్రేడ్లు అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు . వారు పోటీచేయాలనుకున్న స్థానాల్లో క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు . ప్రజలను కలుస్తున్నారు. ప్రజాసమస్యలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు . రెండు కమ్యూనిస్టులకు తెలంగాణ రాష్ట్రంలో 40 కు పైగా స్థానాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి ఉందని అంటున్నారు . పొత్తులు ఉంటే తమకు బలమైన 10 నుంచి 13 సీట్లలో కచ్చితంగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు .ఒకటి అర అటు ఇటు అయినా, పట్టు విడుపులు ప్రదర్శించాలని లెఫ్ట్ పార్టీల జాయింట్ సమావేశంలో నేతల ఒక అభిప్రాయానికి వచ్చారు . రెండు పార్టీలు ఒకరు పోటీచేసే స్థానంలో మరొకరి పోటీచేయరాదని జంటిల్ మెన్ అగ్రిమెంట్ చేసుకున్నారు . కానీ బీఆర్ యస్ శిబిరంలో ఇది ఉన్నట్లు కనిపించడంలేదని సందేహాలు కలుగుతున్నాయి.

రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి . పోడుభూములు ,ఉద్యోగులు రెగ్యూలరైజేషన్ , ధరణి , వీఆరో ఓ ల ,అంగనా వాడీలు , ఆశావర్కర్ల సమస్యలపై తమ స్వతంత్ర కార్యాచరణ కొనసాగిస్తూనే బీజేపీ వ్యతిరేక పోరాటంలో బీఆర్ యస్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లు పలు సభల్లో ,సమావేశాల్లో చెపుతున్నారు. కేసీఆర్ బీజేపీని రాష్ట్రంలో రాకుండా అడ్డుకునే ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్నారని ఆకారణంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఒక లెఫ్ట్ నేత అన్నారు . వామపక్షాలతో కలిసి పనిచేద్దామంటూనే వారికీ సీట్లు ఎందుకు..? ఓట్లు ఎక్కడవి …? వారికీ ఓట్లు వేసే రోజులు పోయాయని కొందరు బీఆర్ యస్ నేతలు కమ్యూనిస్టులను తక్కువ చేసి మాట్లాడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి . ఇలాంటి వ్యాఖ్యలు పొత్తులకు విఘాతం కలిగించేలా ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి ..దీంతో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్లో బీఆర్ యస్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ప్రత్యాన్మాయ ఆలోచనలు చేయాలనే వత్తిడి నాయకులపై పెరుగుతుంది.

కమ్యూనిస్టుల బీజేపీ వ్యతిరేకతను ఆసరా చేసుకున్న కేసీఆర్ వారితో స్నేహం ద్వారా మూడొవసారి అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు . అయితే కమ్యూనిస్టులకు సముచితమైన స్థానం ఇచ్చి వారిని గౌరవించేందుకు సిద్ధంగా లేరని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దానిపై బీఆర్ యస్ నుంచి ఏలాంటి వివరణ , ఖండన లేదు .. సిపిఎం కు సిపిఐ లకు చెరో రెండు ఎమ్మెల్సీ సీట్లు , ఒక్కక్క రాజ్యసభ సీటు ఇస్తే సరిపోతోందనే ఫీలర్లు వదులుతున్నారు . దీన్ని వామపక్షాలు తీవ్రగం తప్పు పడుతున్నాయి. పొత్తులు అనేది ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి . ఆలా కాకుండా స్నేహపూర్వక పోటీ అంటే అంగీకరించే ప్రశ్న లేదని అంటున్నారు కామ్రేడ్లు .పొత్తులు స్నేహపూర్వక పోటీ అనేది పెద్ద జోక్ లాంటిదని కొట్టి పారేస్తున్నారు . ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టే లక్ష్యంగానే తమ కార్యాచరణ ఉంటుందని అంటున్నారు .

మరో వాదన కూడా ఉంది …గతంలో ఒంటరిగా పోటీచేసిన గులాబీ పార్టీ ఈసారి కమ్యూనిస్టులతో కలిసి పోటీచేస్తే బలహీన పడ్డామనే సంకేతాలు వెళతాయని, అందువల్ల వారికీ అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఇవ్వద్దని కొందరు అధికార పార్టీ నేతల వాదన… కానీ కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా బీఆర్ యస్ పోటీ చేస్తే తిరిగి అధికారం దక్కించుకోవడం అంత తేలికకాదని పరిశీలకుల అభిప్రాయం .. కమ్యూనిస్టులకు మాత్రం పోయేది ఏమిలేదు …గత రెండు సార్లుగా అధికారంలోకి వచ్చిన బీఆర్ యస్ కు ఈసారి ప్రజల్లో సానుకూలత కనిపించడంలేదని అనేక సర్వే లు చెపుతున్నాయి. అంతే కాకుండా కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే 30 పైగా నియోజకవర్గాల్లో వారి ఓట్లు బీఆర్ యస్ కు ఉపయోగపడే అవకాశం ఉందని తెలుస్తుంది . దాన్ని ఉపయోగించుకుంటారో వదిలేసుకుంటారో కేసీఆర్ చేతుల్లోనే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు …

రాష్ట్రంలో ఎన్నికల కోసం బీజేపీ , కాంగ్రెస్ ఎవరికి వారు తమదైన శైలిలో రంగంలోకి దిగారు . బీఆర్ యస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల వద్దకు వెళ్ళుతున్నారు . ఎందుకో ఎక్కడో తేడా కొడుతోంది. అనేక జిల్లాల్లో బీఆర్ యస్ లో అసమ్మతి సెగలు బయట పడుతున్నాయి. ప్రజల్లో కూడా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత కనిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ యస్ ఈ ఎన్నికలల్లో సరైన ఎత్తులు వేయకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చు …తస్మాత్ జాగ్రత్త ….

Related posts

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గుండెపోటు…

Drukpadam

దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే కశ్మీర్ ఫైల్స్ విడుదల చేశారు: సీఎం కేసీఆర్!

Drukpadam

క్షమాపణ చెప్పి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోండి: రాహుల్ గాంధీ!

Drukpadam

Leave a Comment