తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పోటీ ఖాయం …!
–పొత్తు ఉంటే పరిమిత సీట్లలో …లేకపోతె 40 కి పైగా సీట్లలో పోటీ
–కఠినమైన నిర్ణయం దిశగా ఆలోచనలు
–తమకు పోయేదేమీ లేదంటున్న కమ్యూనిస్టులు
–బీజేపీ ఓటమితోపాటు …అసెంబ్లీలో అడుగుపెట్టడం తమలక్ష్యమని స్పష్టికరణ
–బీఆర్ యస్ తో తేడా వస్తే కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధపడుతున్న కామ్రేడ్లు …?
సుదీర్ఘ చరిత్రకలిగి ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలను ప్రభావితం చేసిన కమ్యూనిస్టులు మొదటిసారిగా గత శాసనసభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శాసనసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయారు. కమ్యూనిస్టులు లేకపోవడంతో పేదల పక్షాన నిలిచి వారి బాధలను వినిపించే గొంతులు కరువైయ్యాయి. కమ్యూనిస్ట్ ప్రతినిధులు లేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు సామాన్య ప్రజల నుంచి ఉద్యోగులవరకు అందరు వ్యక్తం చేస్తున్నారు . బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులను వ్యక్తులను ఐక్యంచేసే పనిలో లెఫ్ట్ పార్టీలు నిమగ్నమైయ్యారు . ప్రత్యేకించి తెలంగాణాలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ యస్ ,బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని నమ్ముతున్న కమ్యూనిస్టులు రాష్ట్రలో ఆపార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు .కేసీఆర్ తో రెండు పార్టీల నేతలు విడివిడిగా భేటీ అయ్యారు .మునుగోడు ఎన్నికల తర్వాత కేసీఆర్ కు దగ్గరైన కమ్యూనిస్టుల సహకారంతో తిరిగి మూడవసారి అధికారంలోకి రావాలని ఎత్తులు వేస్తున్నారు . అయితే కమ్యూనిస్టుల సహకారం కావాలంటూనే వారికీ మాత్రం సీట్లు కేటాయించే విషయంలో బీఆర్ యస్ శ్రేణులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. దీంతో కమ్యూనిస్టుల పొత్తు అంశంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. బీఆర్ యస్ పొత్తుకు అనుకూలంగా ఉంటే, కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా పరిమిత సీట్లకైనా ఒకే అంటున్నారు . కానీ బీఆర్ యస్ మరోలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానిపై కమ్యూనిస్ట్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగుల్చుతుంది. కమ్యూనిస్టులకు ప్రజాక్షేత్రంలో కాకుండా కేవలం ఎమ్మెల్సీ లు , రాజ్యసభ సీట్లు ఇచ్చి సరిపుచ్చాలని చూస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. దీనిపై కమ్యూనిస్ట్ అగ్రనేతలు మౌనంగా ఉండటంపై కింది స్థాయి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు . కమ్యూనిస్టులకు పోయేది ఏమిలేదు …తమతో గౌరవప్రదమైన ఒప్పందం లేకపోతె బీఆర్ యస్ కు నష్టమని అంటున్నారు . తమ పార్టీలు గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదని రెండు కమ్యూనిస్టులకు బలమైన స్థానాలు, పార్టీ నిర్మాణం, శాఖలు , ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలనే అడుగుతున్నామని అంటున్నారు. దాన్ని కూడా అంగీకరించకపోతే పొత్తు కష్టమేనని అభిప్రాయాలు ఉన్నాయి.
ఒక వేళ బీఆర్ యస్ తో కమ్యూనిస్టులకు పొత్తు కుదరకపోతే వారి దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రెండు పార్టీలు తమకు 5 నుంచి 10 వేల ఓట్లు కలిగిన 40 పైగా నియోజకవర్గాల్లో పోటీచేయడం …రెండవది కాంగ్రెస్ తో జత కట్టడం …ఇదే జరిగితే బీఆర్ యస్ కు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తోడు అండగా ఉంటారనుకున్న కమ్యూనిస్టులు దూరం అయితే బీఆర్ యస్ ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలకుల అభిప్రాయం …