అసెంబ్లీ అభ్యర్థులపై బీఆర్ యస్ లీకులు …కరీంనగర్ లోకసభకు అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్ …
–ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్..
–కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరును ప్రకటించిన కేటీఆర్
–హుస్నాబాద్ సభలో కేటీఆర్ కీలక ప్రకటన
–బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని ఓటర్లకు విన్నపం
–అంతకు ముందు హుజురాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పేరు ప్రకటన ..
తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాతనే ఏప్రిల్ ,మే నెలల్లో పార్లమెంట్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినప్పటికీ బీఆర్ యస్ అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది . అందులో భాగంగానే అభ్యర్థుల పై లీకులు బయటకు వదులుతున్నట్లు సమాచారం . మూడునెలల క్రితమే క్యాబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 25 మంది సీటింగులకు సీట్లు రావని చెప్పారు . సర్వే లో వారి పనితీరు సరిగా లేదని చెప్పారు. ఇటీవల కాలంలో దళితబంధు మంజూరి విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు వసూల్ చేస్తున్నారని తన ద్రుష్టి కు వచ్చిందని వారి తోకలు కట్ చేస్తానని పార్టీ సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు . ఈ నేపథ్యంలో ఎవరికీ సీట్లు వస్తాయో ఎవరికీ రావో అనే మీమాంస లో పడ్డారు ఎమ్మెల్యేలు ..
బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు . ఈసందర్భంగా ఎన్నికల ప్రస్తావన తీసుకోని వచ్చారు . బీఆర్ఎస్ పార్టీ తమ తొలి అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు . కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. నల్లధనం తెస్తామని చెప్పి తెల్లముఖం వేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పాలంటే సిగ్గేస్తోందని అన్నారు. వినోద్ ను మళ్లీ ఎంపీగా గెలిపించాలని.. బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని అన్నారు.