చంద్రబాబు కుట్రలో భాగమే రాష్ట్రపతికి లేఖ :ఎంపీ మిధున్ రెడ్డి…
-ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకే ఇదంతా చేస్తున్నారు:
-పోలీసులు కొట్టారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు నాటకాలు
-చంద్రబాబు చెప్పినట్లుగానే రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారు
-టీడీపీ నేతలు అరెస్టయినా రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాయలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారని ధ్వజమెత్తారు పోలీసులు కొట్టారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు నాటకాలు ఆడుతున్నారని మిథున్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని, ఆయనకు దెబ్బలు తగల్లేదని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వైద్యులు పేర్కొన్నారని మిధున్ రెడ్డి అన్నారు.
తనను పోలీసులు కొట్టారంటూ రఘురామ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెయిల్ రాలేదని తెలిసే ఇటువంటి నాటకానికి తెరతీశారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలు అరెస్టయినా రాష్ట్రపతికి లేఖ రాయని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్ద కుట్రతోనే లేఖ రాశారని ఆరోపించారు. ప్రభుత్వంపై రఘురామ కుట్రలు చేస్తున్నారని మిథున్‌రెడ్డి అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా రఘురామ వ్యవహరిస్తున్నారని, ప్రజలు ఇటువంటి చెత్త రాజకీయాల వలలో పడకూడదని ఆయన కోరారు.