మునుగోడు సహా ఐదు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి: కూనంనేని
ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని ప్రశ్న
లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యాఖ్య
సచివాలయానికి ప్రతిపక్షాలను రానీయకపోవడంపై ఆగ్రహం
సిపిఐ సిపిఎం పార్టీలు బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో బీఆర్ యస్ తో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అనేక సందర్భాలలో చెప్పారు . అయితే ఇటీవల పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక విధానాలపట్ల లెఫ్ట్ పార్టీల నేతలు అసంతృప్తి తో ఉన్నారు . లిక్కర్ స్కాం, ఓ ఆర్ ఆర్ టోల్ లీజు విషయంలోనూ , కొత్త సెక్రటేరిట్ కు విపక్షాలను అనుమతించకపోవడంపై వారు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తప్పు పడుతున్నారు . విలేజ్ పంచాయతీ సెక్రటరీల సమస్యలపై ప్రభుత్వం వైఖరిపై గుర్రుగా ఉన్నారు . సమ్మెలో ఉన్నా ఉద్యోగులు ఉద్యోగాల్లో చేరకపోతే తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇది ఉద్యోగ ,కార్మిక వ్యతిరేక చర్యగా వారు పేర్కొంటున్నారు .
ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మంగళవారం ఘాటుగానే స్పందించారు . ఈ లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు . కొత్తగా నిర్మించిన సచివాలయానికి ప్రతిపక్షాలను ఎందుకు రానివ్వడం లేదో చెప్పాలని కూనంనేని నిలదీశారు.
ఎన్నికల్లో ఐదు స్థానాలపై సిపిఐ గురి …
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ యస్ తో కలిసి పోటీచేయాలనుకున్న సిపిఐ పొత్తులు ,ఎత్తులు ఎలా ఉన్నా ఐదు స్థానాల్లో కచ్చితంగా పోటీచేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు 40 నుంచి 50 స్థానాల్లో 5 నుంచి 10 వేలకు పైగా ఓట్లు ఉన్నా నియోజకవర్గాలు , పార్టీ నిర్మాణం , శాఖలు ఉన్నాయని పేర్కొంటున్నారు . అయితే బీజేపీని ఓడించేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ యస్ తో కల్సి పోటీచేయాలని నిర్ణయించుకున్నప్పటికీ బీఆర్ యస్ నుంచి సరైన స్పందన కనిపించడంలేదని అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఐదు నియోజకవర్గాలపై కేంద్రీకరించాలని పార్టీ కార్యాచరణ రుపొందించింది. అందుకు అనుగుణంగా ఆ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను రంగంలోకి దింపారు . ఐదు నియోజకవర్గాల్లో హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి, దేవరకొండలు ఉన్నాయి . కూనంనేని కూడా పై అసెంబ్లీ నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.