ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు…
- ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న న్యాయస్థానం
- ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ను అరెస్ట్ చేసిన ఆర్మీ రేంజర్లు
- నేడు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు పేర్కొంది. ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో మంగళవారం ఆర్మీ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇమ్రాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని తెలిపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తమ కస్టడీ నుంచి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం అక్రమాస్తుల నిరోధక సంస్థను ఆదేశించింది.
అక్కడ ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారమే: పాక్ సుప్రీంకోర్టు ఆగ్రహం
- రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టులోకి ప్రవేశించి అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీత
- 90 మంది కోర్టులోకి ప్రవేశిస్తే, ఇక కోర్టు గౌరవం ఎక్కడంటూ వ్యాఖ్య
- ఇమ్రాన్ ఖాన్ ను గంటలోగా కోర్టు ఎదుట హాజరుపరచాలన్న సుప్రీం
పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం భగ్గుమంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండానే కోర్టు ఆవరణలోకి ప్రవేశించి అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారమేనని, ఈ నేపథ్యంలో గంటలోగా ఆయనను కోర్టులో హాజరుపరచాలని జాతీయ జవాబుదారీ బ్యూరోకు పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్, జస్టిస్ ముహమ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పై విధంగా ఆదేశాలను జారీ చేసింది.
కేసు నిమిత్తం లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు వచ్చిన ఇమ్రాన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో అరెస్టు చేసిన తీరుపై ధర్మాసనం విచారణ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ప్రాంగణంలోకి తొంబై మంది ప్రవేశిస్తే ఇక కోర్టు గౌరవం ఎక్కడ? ఏ వ్యక్తిని అయినా కోర్టు ప్రాంగణం నుండి అరెస్టు చేయవచ్చా? అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లుగా డాన్ వార్తా పత్రిక పేర్కొంది.
గతంలో కోర్టు లోపల విధ్వంసానికి పాల్పడిన లాయర్లపై చర్యలు తీసుకున్నారని గుర్తు చేసిన కోర్టు, ఒక వ్యక్తి కోర్టు ఎదుట లొంగిపోయిన తర్వాత, అతనిని అరెస్టు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కోర్టు ధిక్కారానికి పాల్పడిందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయడానికి వారు మొదట రిజిస్ట్రార్ నుండి అనుమతిని తీసుకోవాలని, కోర్టు సిబ్బందిని కూడా అవమానించారన్నారు. కోర్టు తిరిగి సమావేశమయ్యేలోగా అంటే సాయంత్రం నాలుగున్నర గంటలకు ఇమ్రాన్ ఖాన్ ను హాజరుపరచాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NBA)ను ఆదేశించింది.