అవినాశ్ రెడ్డి తల్లి హైదరాబాద్ కు తరలింపు.. టీఎస్ హైకోర్టులో అవినాశ్ బెయిల్ పై వాదనలు ప్రారంభం
- ఈనెల 19న ఆసుపత్రిలో చేరిన అవినాశ్ తల్లి
- మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
- టీఎస్ హైకోర్టులో అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి నుంచి కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి డిశ్చార్జ్ అయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. లోబీపీ, గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఈ నెల 19న విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కొంచెం కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆమెను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నారు.
మరోవైపు అవినాశ్ ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. అవినాశ్ తరపున లాయర్ ఉమామహేశ్వరరావు, సునీత తరపున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సీబీఐ అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
అమ్మను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నాం: వైఎస్ అవినాశ్ రెడ్డి
- అమ్మ ఆరోగ్యం కొంచెం మెరుగైందన్న అవినాశ్
- తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అన్న వైసీపీ ఎంపీ
- అవినాశ్ తల్లిని బెంగళూరు లేదా హైదరాబాద్ కు తరలించే అవకాశం
కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడినట్టు కాసేపటి క్రితం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే గుండె సంబంధిత చికిత్స కోసం ఆమెను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. మరోవైపు తన తల్లి ఆరోగ్యంపై వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందించారు. తన తల్లి ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని ఆయన తెలిపారు. తమకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. తమ వల్ల ఎరికైనా ఇబ్బంది కలిగితే మనసులో పెట్టుకోవద్దని కోరారు. మరోవైపు అవినాశ్ తల్లిని బెంగళూరు లేదా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.