Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోని రెండో పెద్ద దేశం కెనడాలో.. ‘భూమి నో స్టాక్’!

  • ఇండిపెండెంట్ ఇళ్లపై కెనడా యువతరం దృష్టి
  • విలాసవంతంగా ఉండేట్టు ప్రణాళికలు
  • డిమాండ్ పెరిగి భూమికి కొరత
  • ధరలూ భారీగా పెరుగుదల

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు! చేతిలో నాలుగు రాళ్లున్నప్పుడే.. మరో నాలుగు రాళ్లు పోగేసి ఓ గూడు కట్టుకోవాలనుకుంటోంది నవ తరం! అవును మరి, ఇప్పుడు చాలా మంది లోన్ తీసుకునైనా భూమో లేదా ఇల్లో కొనేసుకుంటున్నారు. కానీ, వైశాల్యంలో ప్రపంచంలోని రెండో అతిపెద్ద దేశం కెనడాకు ఓ పెద్ద కష్టమొచ్చిపడింది.

కొందామన్నా అక్కడ భూమి దొరకట్లేదట. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఆ దేశంలో భూమికి డిమాండ్ పెరిగిపోయిందట. ఇంకేముందీ.. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘భూమి నో స్టాక్’ అని బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అక్కడి రియల్ ఎస్టేట్ పరిస్థితులపై బ్లూమ్ బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.

అదే అసలు సమస్య…

అక్కడ ఇళ్లు కొనాలనుకుంటున్న వారు ‘పెద్ద పెద్ద ఇండిపెండెంట్ ఇళ్లు’ కావాలంటున్నారట. అక్కడ భూమి దొరకకపోవడానికి అదే పెద్ద సమస్య అయిపోయిందట. ఇప్పటిదాకా అంత పెద్ద ఇళ్లు ఇచ్చేసిన వ్యాపారులు.. ఇకపై ఎవరైనా అడిగినా అంత పెద్ద ఇళ్లకైతే చోటు అస్సలు లేదంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. దేశంలోని పెద్ద నగరాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటి తరం వారు ఇళ్లు విలాసవంతంగా ఉండాలని కోరుకుంటున్నారని, పెద్ద పెద్ద హాళ్లు, సకల హంగులు, సౌకర్యాలు, ముందు కొంచెం ఖాళీ స్థలం ఉండేలా చూసుకుంటున్నారని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

‘‘కెనడాలో భూములు దొరకకపోవడమన్నది ఇటీవలి పరిణామమే. యూరప్, జపాన్ ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఆ ట్రెండ్ ఇప్పుడే మొదలైంది’’ అని రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా ఆర్థికవేత్త రాబర్ట్ హోగ్ అన్నారు. రాబోయే తరాల్లో సొంతింటి కల అన్నది మరింత పెరిగిపోతుందన్నారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే కెనడాలోని ఎక్కువ మంది పెద్ద ఇళ్లలోనే నివాసముంటున్నారని చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లతో పోలిస్తే ఆ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది. గత ఏడాది టొరంటో, మాంట్రియల్, వాంకోవర్ లోని 18 ప్రాంతాల్లో జరిగిన ఇళ్ల అమ్మకాల్లో 60 శాతం పెద్ద ఇండిపెండెంట్ ఇళ్లను చిన్న కుటుంబం వారే తీసుకున్నారట.

అయితే, అంతకుముందు పదేళ్లలో 60 శాతం ఇళ్లు అపార్ట్ మెంట్లలోనే కొనేవారని, కేవలం 25 శాతమే ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లు జరిగేవని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇండిపెండెంట్ ఇళ్లకు డిమాండ్ పెరగడంతో వాటి ధరలూ అమాంతం ఎగబాకేశాయి.


గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలు కాస్త తగ్గింది. గత ఏడాదిలో 24 శాతం మేర అమ్మకాలు జరిగితే ఇప్పుడది 19 శాతానికి పడిపోయిందట. ఏప్రిల్ లో కొంచెం పెరిగినా కొత్త ఇళ్ల కట్టడం నిదానంగా సాగుతోందట. ఈ ఏడాది తగ్గడానికి కారణం భూమి లభ్యత లేకపోవడమేనని అంటున్నారు.

కోటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భూమితో ఉన్న కెనడాలో.. పెద్ద పెద్ద సిటీల్లోనే ఎక్కువ మంది జనం నివసిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి నగరాల్లోనే ఉంటుండడంతో అక్కడే ఎక్కువ మంది ఉంటున్నారన్నది వారి మాట.

అయితే, పర్యాటక రంగాన్ని మరింత బలపరిచేందుకు అపార్ట్ మెంట్లపైనా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడూ దృష్టి సారించారు. అందులో భాగంగా అపార్ట్ మెంట్ సంస్కృతిని యువతలో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అపార్ట్ మెంట్లకూ డిమాండ్ భారీగానే ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు: 5,326 మంది ఓటర్లు …  శశాంక్‌ గోయల్‌

Drukpadam

రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం

Ram Narayana

తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్ ను గెలిపించండి …పవన్ కళ్యాణ్ పిలుపు

Ram Narayana

Leave a Comment