పినపాక కాంగ్రెస్ అభ్యర్థిగా పి. శ్రీవాణి పేరు పరిశీలన ….!
–గ్రామ సర్పంచ్ గా ఉన్న శ్రీవాణి
–రాజకీయాల పట్ల మక్కువ …కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం
–అంతకు ముందు అత్త , భర్త కూడా సర్పంచులే
–విద్యావంతురాలు …మాటకారితనం చురుకుదనం
–ప్రజలను ఆకట్టుకునే నైజం…నియోజవర్గ ప్రజలతో సంబంధాలు
–సర్పంచ్ గా గ్రామానికి మంచి సేవలు అందిస్తున్న శ్రీవాణి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గం (ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ) నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీవాణి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నారు . రాజకీయాల పట్ల మక్కువ ఉన్న శ్రీవాణి కారకగూడెం మండలం సమిత్ భట్ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు . డిగ్రీ వరకు చదివిన శ్రీవాణి మాటకారి తనం చురుకుదనంతో ప్రజలను ఇట్టే ఆకట్టుకోగల నేర్పరి …అయితే పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్ లో చేరితే ఆసీటు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్నా పాయం కన్నా శ్రీవాణి అయితే కాంగ్రెస్ నుంచి గట్టి అభ్యర్థి అవుతారని అంటున్నారు స్థానికులు .పైగా ఆమె ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. అంతే కాకుండా ఆమె అత్త ,భర్త కూడా ఇదే గ్రామం నుంచి రెండు శతాబ్దాలకు పైగా గ్రామపంచాయతీ సర్పంచులుగా చేశారు . ఇదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యేతో వీరికి సరిపడదు …అయినప్పటికీ ఆయన్ను ఎదిరించి నిలిచిన కుటుంబంగా శ్రీవాణి కుటుంబానికి పేరుంది.
పినపాక టికెట్ బలంగా ఆశిస్తున్న శ్రీవాణి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని , సీఎల్పీ నేత భట్టిని కలిసి తన మనుసులో మాట చెప్పారు .వారు ఈమె వివరాలు తీసుకున్నారు. నియోజకవర్గంలో తిరగమన్నారు . అయితే ఆమెకు ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ అభ్యర్థుల ఎంపిక సర్వే ల ఆధారంగానే జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.
ఆమె ఇప్పుడు పినపాక నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు . ఆమెకు మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు . కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం కావడంతో ఆమె పట్ల నియోజకవర్గ ప్రజల్లో సానుకూల వాతావరణం ఉన్నట్లు వినికిడి ..అయితే ఆమెతోపాటు మాజీ జడ్పీటీసీ భట్టు విజయ్ గాంధీ , ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య , ఉమ్మడిజిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర కుమారుడు చందా సంతోష్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ శ్రీవాణి వైపే పార్టీ మొగ్గు చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .
పినపాకలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేగా కాంతారావు ఇప్పటికి రెండు సార్లు అక్కడ నుంచి గెలుపొందారు . రెండు పర్యాయాలు కూడా ఆయన కాంగ్రెస్ టికెట్ పై విజయం సాధించారు . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు కొద్దీ కాలానికి ఆపార్టీకి గుడ్ బై చెప్పి అధికార బీఆర్ యస్ లో చేరారు . 2009 లో కాంగ్రెస్ తరుపున గెలిచిన రేగా కాంతారావు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు . రేగా కదలికలను కనిపెట్టిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైకాపాలోకి వెళ్లకుండా పాచికలు వేశారని ప్రచారం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి అధికార పార్టీలో చేరడంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పరిశీలకుల అభిప్రాయం… అయితే పార్టీ మారిన తాను నియోజకవర్గానికి మేలు చేశానని , అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అంటున్న ఆయనకు ప్రజల్లో మిక్సుడ్ రెస్పాన్స్ ఉంది. పైగా బీజేపీ తన పార్టీలో చేర్చుకునేందుకు ఫామ్ హౌస్ లో వల వేసిన నలుగురిలో రేగా ఒకరు …అయితే వారు ఈ విషయాన్నీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకోని పోయి బీజేపీ మద్యవర్తులగా పంపబడినవారి ఆటలు కట్టించామని చెబుతున్న వాటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రేగా మాత్రం కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీచేయమంటే అక్కడ నుంచి పోటీచేస్తానని అంటున్నారు . రేగా కాంతారావును ఈసారి మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి పోటీచేయించే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటున్నారు పరిశీలకులు … చూద్దాం ఏమి జరుగుతుందో …