- సంస్థ ఉద్యోగులను బంధించి లూటీకి పాల్పడిన దొంగలు
- ఉదయం ఏడున్నర గంటలకు పోలీసులకు ఫిర్యాదు
- ఆరుగురు దొంగలు వచ్చినట్లు పోలీసుల గుర్తింపు
- గోడ దూకి వచ్చారా లేక సంస్థలో తెలిసిన వారి ద్వారా వచ్చారా విచారణలో తేలుతుందన్న పోలీసులు
లూథియానాలోని ఓ క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీలో గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 కోట్ల మేర లూటీ చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం 2 గంటలకు (శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) జరిగింది. ఉదయం ఈ చోరీని గుర్తించిన కంపెనీ ఉద్యోగులు ఉదయం ఏడున్నర గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను బంధించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులు తప్పించుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
వివిధ బ్యాంకుల నుండి వచ్చిన క్యాష్ మొత్తాన్ని ఈ క్యాష్ మేనేజ్ మెంట్ కంపెనీ పాయింట్ కు నిన్న తీసుకు వచ్చారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన్ దీప్ సింగ్ తెలిపారు. బ్యాంకులకు శనివారం, ఆదివారం సెలవు రోజు కావడంతో డబ్బును ఇక్కడే పెట్టినట్లు చెప్పారు. ఈ లూటీ ఘటన అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందని, పోలీసులకు ఉదయం సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.
రాబరీకి పాల్పడినవారు బౌండరీ వాల్ దాటుకొని వచ్చారా లేక సంస్థలో ఎవరైనా తెలిసిన వారి ద్వారా వచ్చారా అనేది విచారణలో వెల్లడవుతుందన్నారు. లూటీ జరిగిన సమయంలో సంస్థలో ఐదుగురు ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. నిందితులు మాత్రం ఆరుగురు వచ్చినట్లుగా తెలుస్తోందని చెప్పారు. స్థానికంగా ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిందితులు లూటీ చేసి వ్యాన్ లో పరారైనట్లు చెబుతున్నారు.