- సీఐ రాజకీయ ఒత్తిళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నారన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి
- వైసీపీ లీడర్లను కేసుల నుంచి తప్పించాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపణ
- రాజకీయ లబ్ధి కోసమే నిందలు వేస్తున్నారన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
- పోలీసులను జేసీ ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలుసని విమర్శ
అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
తాడిపత్రి పట్టణ సీఐ రాజకీయ ఒత్తిళ్లతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సీఐ మృతదేహానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టిన 9 నెలల కాలంలో.. సుమారు ఐదు నెలల నుంచి వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. వైసీపీ లీడర్లను కొన్ని కేసుల్లో నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ కారణంతోనే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు” అని ఆరోపించారు.
ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసు. ఏదేమైనా సీఐ మృతి బాధాకరం. ఆయన ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరుతాం” అని తెలిపారు.