- మూసారాంబాగ్ లో మూసీనది వరద పరిస్థితిని సమీక్షించిన కేటీఆర్
- వర్షాలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడి
- నిరంతరం పని చేస్తోన్న ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీయవద్దని ప్రతిపక్షాలకు హితవు
- భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలం
- జలాశయాలను తలపిస్తున్న నగర కూడళ్లు
- భారీ కాల్వల్లా మారిపోయిన ప్రధాన రహదారులు
- జల దిగ్బంధంలో మోరంచపల్లి గ్రామం
- ఇళ్ల పైకప్పుల మీదికి గ్రామస్థులు
- రక్షించాలంటూ అధికారులకు ఫోన్లు
- చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు
- తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న వానలు
- పలు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం
- ములుగు, భూపాలపల్లికి, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలకు ప్రత్యేక ఆధికారులు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది .ఆ జిల్లాల్లో మంత్రులు అధికారులు నిత్యం వరద పరిస్థితులను పర్వవేక్షిస్తున్నారు .అధికారులను అప్రమత్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి ,ములుగు , భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం , మహబూబాబాద్ వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో వాగులు ,వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలూ జలదిగ్బంధనంలో ఉన్నాయి. ప్రధానంగా మోరువంచ అనే గ్రామంలో ఇళ్లపైకి కూడా నీళ్లు రావడంతో సీఎం కేసీఆర్ ప్రజలను రక్షించేందుకు రెండు ప్రత్యేక హెలీకాఫ్టర్లను సహాయక చర్యలకు పంపించారు . సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు . జిల్లా కలెక్టర్లతోను , ఎస్పీ లతోను సీపీ లతోను మాట్లాడుతున్నారు . మంత్రులకు సహాయక చర్యలు సమీక్షించే భాద్యతను పెట్టారు . మంత్రి కేటీఆర్ , జి ఎచ్ ఎం సి పరిధిలో నీటిముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అన్ని రకాల సహాయం చేస్తామని ఎవరు ఆధైర్య పడవద్దని దైర్యం చెప్పారు…
కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు మూసారాంబాగ్ లో మూసీనది వరద పరిస్థితిని పరిశీలించారు. బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సాయం అందించాలన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుండి ప్రజలను తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. సంబంధిత ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
ప్రాణనష్టం జరగకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మానుకొని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని సూచించారు. వర్షంలో నిరంతరం పని చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దన్నారు. విపత్కర పరిస్థితుల్లో చేతనైతే సాయం చేయాలన్నారు. వరంగల్ కూడా నీట మునిగిందని, అవసరమైతే తాను శుక్రవారం అక్కడకు వెళ్తానని చెప్పారు.
సాయం కోసం మోరంచ గ్రామస్థుల ఆర్తనాదాలు.. వీడియో పంపిన బాధితుడు !
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు. తమ పశువులను సైతం డాబాలపైకి ఎక్కించి కాపాడుకుంటున్నారు. ఇప్పటికే వరదల్లో పలువురు కొట్టుకుపోయారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
తమను కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది. లారీ పెకి ఎక్కిన డ్రైవర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. పక్కనే ఓ చెట్టు పైకెక్కి ఇద్దరు గ్రామస్థులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితిపై ఓ వ్యక్తి వీడియో తీసి తమను కాపాడాలంటూ అధికారులకు పంపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మునిగిన వరంగల్.. స్విమ్మింగ్ ఫూల్‌లా రైల్వే స్టేషన్.. ఇవిగో వీడియో
తెలంగాణలో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కడెం సహా పలు ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇటు వానలు, అటు వరదల ధాటికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. తెలంగాణలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన వరంగల్ నీట మునిగింది. కూడళ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులు భారీ కాల్వల్లా మారిపోయాయి.
భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద పోటెత్తింది. హనుమకొండ-వరంగల్ రహదారి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నిలిచింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. వరంగల్ నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్‌లోకి భారీగా నీరు చేరుకుంది. దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లున్నాయి.
మైలారం వద్ద భారీ వృక్షం కూలి అధిక సంఖ్యలో వాహనాలు నిలిచాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.
తెలంగాణలో వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు!
ఎడతెరిపిలేని వానలు తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది. వరంగల్ నగరం నీట మునిగింది. కొన్ని ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇంకొన్ని రోజులు వానలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లను సీఎస్ శాంతికుమారి నియమించారు. ములుగు జిల్లా ప్రత్యేక అధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్, నిర్మల్‌కు ముషారఫ్ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ జిల్లాకు హన్మంతరావును నియమిస్తూ ఉత్తర్వులు చేశారు. వీరంతా ఆయా జిల్లాల్లో వరద పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.