- పిల్లలను విచారించగా బయటపడ్డ మోసం
- ఆయన ఎవరో కూడా తెలియదన్న పిల్లలు
- పని ఇప్పిస్తానంటూ తీసుకు వచ్చాడని వెల్లడి
టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది వాటిని కొనడం మానేశారు. కొంతమంది మాత్రం కొత్తరకం మోసాలకు పాల్పడుతూ టమాటాలను ఎత్తుకెళుతున్నారు. టమాట లారీ బోల్తా పడడంతో పోలీసులు కాపలాగా ఉన్నారని.. ‘వాహనం బోల్తా పడడంతో గాయపడిన డ్రైవర్ ను పట్టించుకోకుండా టమాటాలు తీసుకెళ్లిన జనం’ వంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఒడిశాలో మాత్రం ఓ కొత్త రకం మోసం బయటపడింది. టమాటా వ్యాపారిని ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. తనతో వచ్చిన ఇద్దరు పిల్లలను షాపు దగ్గర కూచోబెట్టి నాలుగు కిలోల టమాటాలతో పరారయ్యాడు.
కటక్‌లోని ఛత్రబజార్ ఏరియాలో ఉన్న ఓ కూరగాయల దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి నాలుగు కిలోల టమాటాలు తీసుకున్నాడు. మరో పది కిలోలు కూడా కావాలని చెప్పాడు. ఆపై బ్యాగు తీసుకొస్తానని, అప్పటి వరకు తన పిల్లలు ఇక్కడే ఉంటారని నాలుగు కిలోల టమాటాలతో వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో వ్యాపారి అనుమానించాడు. పిల్లలను విచారించడంతో తన అనుమానం నిజమేనని నిర్ధారణ అయింది. తమను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అసలు తమకు తెలియదని ఆ పిల్లలు చెప్పారు. పని ఇప్పిస్తానని, చెరో రూ.300 ఇస్తానని చెప్పడంతో ఆయనతో కలిసి వచ్చామని వివరించారు. తమను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్లిపోయాడని చిన్నారులు బోరుమన్నారు.