రైతు చట్టాలను పాతరేయాల్సిందే :బ్లాక్ డే లో రైతు నేత తికాయత్
రైతు చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ రణం 180 రోజులుపూర్తీ
-దేశరాజధాని సరిహద్దులలో మకాం వేసిన రైతులు
-చట్టాలు రద్దు చేయాల్సిందే …కిసాన్ సంయుక్త మోర్చా
-కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన స్టాలిన్
-ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
-ఇప్పటికే కేరళ అసెంబ్లీ తీర్మానం
రైతులతో కేంద్రం నిర్మాణాత్మక చర్చలు జరపలేదు
రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలి
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సిందే
కేంద్రప్రభుత్వం రైతుల మేలుకోసమని తీసుకొచ్చిన చట్టాలు పాతరేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులూ రాకేష్ సింగ్ తికాయత్ పునరుద్ఘాటించారు.
ఎస్ కే ఎం ఇచ్చినపిలుపు మేరకు మే 26 న ఘజియాబాద్ సరిహద్దులలో ఢిల్లీ -మీరట్ ఎక్సప్రెస్ హైవే వద్ద జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రం కరోనా మహమ్మారి సమయంలో తెచ్చిన చట్టాలు రైతుల మేలుకోసం, ఎంతమాత్రం కాదని ,ఆ చట్టాలు కేవలం కొద్దీ మంది కార్పొరేట్ శక్తుల మేలుకోసమేనని అన్నారు. ఉద్యమం ప్రారంభమై ఆరునెలలు దాటింది.ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు అసమగ్రంగానే ముగిశాయి. రైతుల వాదనలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వరంలో ఇచ్చిన పిలుపుకు దేశంలోని అన్నిప్రాంతాలలో రైతులు స్పందించారని అన్నారు. బ్లాక్ డే విజవంతమైందని పేర్కొన్నారు. రైతుల కోసం ఇంత సుదీర్ఘకాలం నడిచిన ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే లేదని తెలిపారు. తమ ఉద్యమానికి ప్రత్యేక్షంగా ,పరోక్షంగా మద్దతు తెలుపుతున్న ప్రతిఒక్కరికి కృతజ్నతలు తెలియజేస్తున్నాం అన్నారు . మూడు రైతు చట్టాలను రద్దు చేయాల్సిందే లేకపోతె భవిష్యత్ తరాలు క్షమించవని తికాయత్ అన్నారు. కోవిద్ మహమ్మారి నిబంధనలు పాటిస్తూ ఎంతో శాంతియుతంగా బ్లాక్ డే పాటించిన ప్రజలకు , ప్రజాసంఘాలు , రాజకీయపార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. తమ నిరసన అణిచివేసేందుకు పెద్ద ఎత్తున మోడీ సర్కార్ పోలీస్ బలగాలను దింపిందన్నారు.చట్టాలు రద్దు అయ్యేవరకు రైతులు ఢిల్లీ సరిహద్దులను వదలబోరని తికాయత్ స్పష్టం చేశారు. పంటను ఎంత జాగ్రత్తగా కాపాడు కుంటమో అదే విధంగా రైతు ఉద్యమాన్ని కాపాడుకోవాలని తికాయత్ పిలుపు నిచ్చారు. పంజాబ్,ఉత్తరప్రదేశ్ ,హర్యానా , ఉత్తరాఖండ్ ఢిల్లీ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున బ్లాక్ డే పాటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి. రైతులకు పలు పార్టీలు, రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తామని చెప్పారు.
రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు గడిచినా.. వారితో ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్చలు జరపలేదని స్టాలిన్ విమర్శించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని చెప్పారు. రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని… వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.