- బీఆర్ఎస్ జాబితా చూశాక కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తేలిందన్న టీపీసీసీ చీఫ్
- రెండోస్థానంలో పోటీ ద్వారా గజ్వేల్‌లో ఓటమిని అంగీకరించారని వ్యాఖ్య
- ఖర్గే నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్న రేవంత్
- షబ్బీర్ అలీపై పోటీ ద్వారా మైనార్టీ ద్రోహిగా కేసీఆర్ నిలుస్తున్నాడని ఆగ్రహం
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తేలిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఓటమి తప్పదనే ఉద్ధేశ్యంతోనే కామారెడ్డికి పారిపోయి పోటీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు షబ్బీర్ అలీ చేతిలో ఓటమి ఖాయమన్నారు. గజ్వేల్‌లో స్వయంగా ఆయన ఓటమిని అంగీకరించారన్నారు. తాము మూడింట రెండొంతుల మెజార్టీతో గెలుస్తామని టీపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన వైనం చూస్తే తమ సవాల్‌ను స్వీకరించక ఓటమిని అంగీకరించినట్లుగా తెలుస్తోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వాలని తాను సవాల్ చేశానని, కానీ చాలాచోట్ల అభ్యర్థులను మార్చారన్నారు. మంచి ముహూర్తం చూసుకొని జాబితాను విడుదల చేస్తామని చెప్పారని, కానీ ఆ సమయానికి మద్యంకు సంబంధించిన పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంటే కేసీఆర్ ప్రాధాన్యత మద్యం అని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ ప్రకటించిన జాబితా చూశాక కాంగ్రెస్‌కు, తెలంగాణ ప్రజలకు ఇక ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని అర్థమైందన్నారు.
సోనియా గాంధీ నాయకత్వంలో.. ఖర్గే నేతృత్వంలో త్వరలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. సిట్టింగ్‌లకు సీటు ఇవ్వాలని తాను మొదటి నుంచి సవాల్ చేస్తున్నానని, కేసీఆర్‌కు చేతనైతే మళ్లీ గజ్వేల్ నుండి పోటీ చేయాలని చెప్పానని, కానీ ఇప్పుడు పారిపోయి కామారెడ్డికి వెళ్తున్నాడన్నారు. పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తానని చెప్పే నేత ఇప్పుడు రెండుచోట్ల నుండి పోటీ చేస్తానని చెబుతున్నాడంటే ఓటమి భయమే అన్నారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఉన్నారని, అలాంటి వ్యక్తిపై పోటీ చేయనున్నారంటే మైనార్టీలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గజ్వేల్ నుండి పారిపోవాలనుకుంటే అల్లుడి సిద్దిపేట, కొడుకు సిరిసిల్ల ఉన్నాయన్నారు. కానీ మైనార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడం ద్వారా మైనార్టీ ద్రోహిగా నిలుస్తున్నాడన్నారు. కామారెడ్డి నుండి పోటీ అంటేనే కేసీఆర్ లో భయం కనిపిస్తోందన్నారు.