- నిమ్మలో విటమిన్ సీ పుష్కలం
- వ్యాధి నిరోధక శక్తి, జీర్ణశక్తి దీనితో బలోపేతం
- శరీరంలో పీహెచ్ స్థాయి బ్యాలన్స్
- బీపీ తగ్గి, గుండెకు రక్షణ
ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలన్న సూచన మన బంధుమిత్రులు, స్నేహితుల నుంచి వినిపిస్తుంటుంది. ఉదయం గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగే వారు చాలా మందే ఉన్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలంగా తయారవుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజూ లెమన్ వాటర్ ఎందుకు తాగాలన్నది బెంగళూరుకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు దివ్యా గోపాల్ వెల్లడించారు.
- ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత నీటి పరిమాణం ఉండాలి. నిమ్మకాయ నీరు ఇందుకు సాయపడుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీవక్రియలు చురుగ్గా పని చేయడంలో దీని పాత్ర ఉంటుంది.
- విటమిన్ సీ కావాల్సినంత లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండడానికి ఇది అవసరం. గాయాలు మానడంలో, కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది. చర్మం, కణజాలం ఆరోగ్యంగా ఉండేందుకు కొల్లాజెన్ అవసరం. కణాలు దెబ్బతినకుండా విటమిన్ సీ చూస్తుంది. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. చర్మం ముడతలు పడడాన్ని కూడా నివారిస్తుంది.
- జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది. కడుపుబ్బరం, అజీర్ణం సమస్యలు తొలగిపోతాయి.
- నిమ్మ నీరు బరువు తగ్గేందుకు కూడా సాయపడుతుంది. జీవక్రియలు బలపడడం వల్ల ఇది సాధ్యపడుతుంది. శరీరంలో చెడు కొవ్వులు కరిగిపోతాయి.
- నిమ్మలోని పొటాషియం గుండెకు రక్షణనిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఆర్టరీస్ దెబ్బతినకుండా యాంటీ ఆక్సిడెంట్లు రక్షణనిస్తాయి.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ సాయపడుతుంది. మూత్రంలో సిట్రేట్ స్థాయులు పెరగడం వల్ల రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. నిమ్మనీరు పరిమితికి మించి ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వుంది.
- నిమ్మలోని అసిడిక్ గుణం పళ్ళపై ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడూ నీళ్లతో కలిపే తీసుకోవాలి. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను నిమ్మలోని విటమిన్ సీ నివారిస్తుంది.
- నిమ్మలోని అసిడిక్ స్వభావంతో నీటికి ఆల్కలైజింగ్ స్వభావం ఏర్పడుతుంది. ఇది శరీరంలో పీహెచ్ బ్యాలన్స్ కు మేలు చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యం దృఢంగా ఉంటుంది.