భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత…
స్వామినాథన్ వయసు 98 ఏళ్లు
చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర
భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. ఆహార కొరతతో మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఆయన చేసిన కృషి… తక్కువ ఆదాయం కలిగిన రైతులు కూడా ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి దోహదపడింది.
వ్యవసాయరంగంలో స్వామినాథన్ చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సగౌరవంగా సత్కరించింది. 1987లో తొలి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ఆయన అందుకున్నారు. హెచ్ కే ఫిరోదియా అవార్డ్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ లతో పాలు పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసేసె అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులతో ఆయనను సత్కరించారు. 2022లో స్వామినాథన్ భార్య మీనా చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు.
స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో మెజార్టీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడిపడి ఉందనే దార్శనికతతో, సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయంలో స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్ కృషి ఉందన్నారు.
దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎంఎస్ స్వామినాథన్ చేసిన అద్భుత ప్రయోగాలతో మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో వారు చేసిన పరిశోధనలు సిఫార్సులు దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భద్రత దిశగా దార్శనికతతో జీవితకాలం కృషి చేసిన తొలి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అన్నారు.
ఇటీవలే వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, తాను వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడం బాధను కలిగిస్తోందన్నారు. వారి మన్ననలు పొందడం రైతుబిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమన్నారు. వారి మరణం దేశ వ్యవసాయరంగానికి తీరని లోటని, దేశ రైతు పెద్దదిక్కును కోల్పోయిందని సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.