- అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
- ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్ర ఉంటుందని ప్రకటన
- ప్రతి రోజు మూడు మీటింగ్ లు ఉంటాయన్న సీఎం
- జనవరి 1న పెన్షన్లు పెంచుతామని వెల్లడి
- తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని వ్యాఖ్య
మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్రను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. ప్రతి రోజు మూడు మీటింగ్ లు ఉంటాయని తెలిపారు. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఉంటారని చెప్పారు.
ఇది కేవలం బస్సు యాత్ర మాత్రమే కాదని… సామాజిక న్యాయ యాత్ర అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదవారికి జరిగిన మంచిని వివరించే యాత్ర అని చెప్పారు. ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, సాధికారత గురించి బస్సు యాత్రలో ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజలకు మరింత మేలు చేయడానికి మళ్లీ జగనే రావాలని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.
పెత్తందార్లపై గెలవాలంటే పేదలంతా ఒక్కటవ్వాలని జగన్ చెప్పారు. రాబోయే ఎన్నికలు పేదవారికి, పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధమని తెలిపారు. జనవరి 1 నుంచి పెన్షన్ ను పెంచుతున్నామని… ఇచ్చిన మాట ప్రకారం రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెంచిన పెన్షన్ అవ్వాతాతలు, వితంతువులకు వర్తిస్తుందని తెలిపారు. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు వైఎస్సార్ చేయూత ఉంటుందని… ఈ పథకం ద్వారా రూ. 19 వేల కోట్లను అందిస్తున్నామని చెప్పారు. జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్ ఆసరా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించామని చెప్పారు. ప్రజలతోనే వైసీపీ పొత్తు అని… గ్రామ స్థాయి నుంచి వైసీపీ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని… పొత్తులపై ఆధారపడనని చెప్పారు.
కానీ విని ఎరగని అభివృద్ధి చేశాం ….జగన్ ..
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, చరిత్రలో కనీవినీ ఎరగని అభివృద్ధిని ఈ 52 నెలల పాలనలోనే చేసి చూపించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. జగన్ మాట ఇస్తే తప్పడనే పేరు సంపాదించుకున్నానని ఆయన వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ వైసీపీ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద 15 వేల హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ, 1.65 కోట్ల ఇళ్లను కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు విజయవాడలో జరుగుతున్న వైసీపీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు.
సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని సీఎం జగన్ తెలిపారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ఓ బాధ్యతగా అధికారాన్ని చేపట్టామని జగన్ వివరించారు. ప్రజలకు తొలి సేవకుడిగా పాలన అందిస్తున్నాం కాబట్టే ఈ 52 నెలల కాలం చరిత్రలో నిలిచేలా మారిందని వివరించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ సెటైర్లు, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. పవర్ స్టార్ పార్టీ పెట్టి పదిహేనేళ్లవుతోందని, కానీ ఆయనకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరన్నారు. ఆ పార్టీకి గ్రామాల్లో జెండా మోసే కార్యకర్తలు లేరన్నారు. పవన్ కల్యాణ్ తన జీవితమంతా చంద్రబాబు భజన చేశారని, టీడీపీ అధినేతను భుజాలపై మోయడానికే సమయం సరిపోతోందన్నారు. చంద్రబాబు, పవన్ ఆలోచనలు అన్నీ మోసాల పైనే అని మండిపడ్డారు. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి అని ఆరోపించారు. టీడీపీ అధినేత జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఆయనను చూస్తే ఎవరికైనా గుర్తుకు వచ్చేవి మోసాలు, వంచనలు, అబద్దాలు, వెన్నుపోటు అన్నారు.
చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ, సీబీఐలు నోటీసులు ఇచ్చాయన్నారు. ఆయనపై తమకు కక్ష ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో సగం మంది పాత టీడీపీ వారే ఉన్నారు కదా? అన్నారు. ఆధారాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేయవద్దనడం ఏమిటన్నారు. అక్రమాలు చేసిన బాబును సమర్థించడం అంటే పేదలకు అన్యాయం చేసినట్లే అన్నారు. తాను లండన్‌లో ఉన్నప్పుడే అరెస్ట్ జరిగిందన్నారు. చంద్రబాబును సమర్థించడం అంటే పెత్తందారీ వ్యవస్థను సమర్థించడమే అన్నారు. పేదవాళ్లు ఏకం కావాలని, అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమన్నారు.
రెండు సున్నాలు కలిసి వచ్చినా, నాలుగు సున్నాలు కలిసి వచ్చినా ఫలితం సున్నానే అవుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే అవుతుందన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, తినడం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు.
డిసెంబర్ 11 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం
డిసెంబర్ 11 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం ఉంటుందని, జనవరి 15 వరకు సాగుతుందని జగన్ తెలిపారు. ఇది ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరమన్నారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ క్రీడా సంబరం అన్నారు. జనవరి 1 నుంచి ఆసరా పెన్షన్ రూ.3వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం పొదుపు సంఘాలను ఆదుకుందని, సున్నా వడ్డీకే రుణాలు అందించిందన్నారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్తామని, మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుతామన్నారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. తాను పొత్తుపై ఆధారపడనని, ఎన్నికల సంగ్రామంలో ప్రజలతోనే తన పొత్తు అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నట్లు చెప్పారు. 87 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కాబట్టి వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.