- తొలి జాబితాలో మార్పులు చేస్తారని ప్రచారం
- ఆందోళన చెందుతున్న బీ పామ్ అందని అభ్యర్థులు
- నెగెటివ్ రిపోర్టుల నేపథ్యంలో చివరి నిమిషంలో పేర్ల మార్పు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీఫ్ కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. అదేవిధంగా ఐదారుగురికి తప్ప మిగతా సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆ పక్కన పెట్టిన వారిని కూడా విధిలేని పరిస్థితుల్లోనే తప్పించాల్సి వచ్చిందని ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ అభ్యర్థులు, నియోజక వర్గ ఇంచార్జ్ ల సమావేశంలో చెప్పారు. అయితే, తొలి జాబితాలో పేరున్న అభ్యర్థులలో కొందరిని తప్పించే అవకాశం ఉందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం కేవలం 51 మందికే కేసీఆర్ బీ ఫామ్స్ అందజేశారు.
మిగతా బీ ఫామ్స్ సిద్ధం కాలేదని ఆయన చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీ ఫామ్ అందుకోని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తొలి జాబితా ప్రకటించి దాదాపు 50 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ బీ ఫామ్స్ సిద్ధం కాలేదనడంపై పార్టీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలపై నెగెటివ్ రిపోర్టుల కారణంగా కొంతమందిని చివరి నిమిషంలో పక్కన పెట్టే అవకాశం ఉందని, అందుకే బీ ఫామ్స్ ఆపేశారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో నేతలు పార్టీ మారే అవకాశం ఉందని, వారికి ఆ అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయకండి: సీఎం కేసీఆర్
ఎన్నికల ముందు చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయొద్దంటూ బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు. ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో ఆదివారం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ చీఫ్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని సూచించారు. తలబిరుసుతనంతో వ్యవహరిస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు. గతంలో అహంకారం ప్రదర్శించడం వల్లే జూపల్లి ఓటమి పాలయ్యారని చెప్పారు.
ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. అలకలు పక్కన పెట్టి అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్ ను సమన్వయకర్తగా నియమించినట్లు కేసీఆర్ చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే 98480 23175 నంబర్‌కు ఫోన్ చేయాలని.. భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారని అభ్యర్థులకు సూచించారు.
జూపల్లి కృష్ణారావు ఉదంతాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జూపల్లి కృష్ణారావు అని ఒకాయన ఉండే.. మంత్రిగా కూడా పని చేశారు. అయినా అహంకారంతో వ్యవహరించారు. ఇతర నాయకులతో మాట్లాడలేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నానంటూ.. ఈ ముఖ్యమైన సమయంలో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు.
మళ్లీ విజయం మనదే.. బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్
తెలంగాణలో మళ్లీ మనదే విజయమంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోమారు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఐదారుగురు తప్ప సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇచ్చామని, రెండు రోజుల్లో అభ్యర్థులు అందరికీ బీఫామ్ లు అందజేస్తామన్నారు. సామరస్యపూర్వకంగా సీట్లను సర్దుబాటు చేశామని, వేములవాడలో న్యాయపరమైన చిక్కుల కారణంగా అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని వివరించారు. విధిలేని పరిస్థితిలోనే అభ్యర్థులను మార్చామని చెప్పారు.
టికెట్ దక్కని నేతలు తొందరపడవద్దని ఇప్పటికే చెప్పామని, మరోమారు కూడా చెబుతున్నామని అన్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులదేనని కేసీఆర్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించలేక రాజకీయ ప్రత్యర్థులు కుయుక్తులు పన్నుతున్నారని, సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అభ్యర్థులను అలర్ట్ చేశారు. ప్రస్తుతం 51 బీఫామ్ లు రెడీ అయ్యాయని, మిగతావి రేపటిలోగా రెడీ అవుతాయని చెప్పారు. బీఫామ్ లు నింపేటపుడు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించారు. అన్నీ మాకే తెలుసని అనుకోవద్దని, ప్రతీది తెలుసుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. కోపతాపాలను పక్కన పెట్టి చిన్న కార్యకర్తను కూడా కలుసుకోవాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ.. ఫొటోలు ఇవిగో!
- కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ కానుక
- ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్న స్పెషల్ బస్సు
- నేడు హుస్నాబాద్ సభలో ప్రచార రథం ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. హుస్నాబాద్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు సీఎం కేసీఆర్ కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ బస్సును అందించారు. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్సు ఇటీవలే హైదరాబాద్ కు చేరుకుంది.
ఆదివారం (నేడు) జరగనున్న హుస్నాబాద్ ప్రచార సభలో ఈ బస్సును కేసీఆర్ ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఈ ప్రచార రథం హుస్నాబాద్ కు పయనమైనట్లు సమాచారం. ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో, కారు గుర్తు, భారతదేశ పటంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తం గులాబీ రంగుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.