-రెండేళ్ల పాలనపై పుస్తకం… ప్రజాసంక్షేమంపై పుస్తకం
-పుస్తకం విడుదల చేయనున్న జగన్
-95 శాతం హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు
-జగన్ ప్రజల్లోంచి వచ్చి సీఎం అయ్యారన్న అంబటి
-కరోనా వేళ మెరుగైన పాలన అందిస్తున్నారని కితాబు
-రాష్ట్రంలో విపక్షాలు బలహీనపడ్డాయని వ్యాఖ్యలు
-చంద్రబాబు చరిత్ర ఇక ముగిసినట్టేనన్న అంబటి
-పథకాలే ఇతివృత్తంగా పుస్తకం రూపకల్పన
-జగన్ పాలనపై ప్రజలకు పుస్తకం ద్వారా నివేదన
ఏపీలో సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది సీఎంలను చూశామని, కానీ ప్రజల్లోంచి నేరుగా వచ్చి సీఎం అయినవారు చాలా తక్కువ మంది అని, వారిలో సీఎం జగన్ ఒకరని తెలిపారు. గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విధంగా ప్రజల నుంచి వచ్చినవారేనని, వారికోవలోకే సీఎం జగన్ కూడా వస్తారని వివరించారు. ప్రజలు తాము ఎవరికి ఓటు వేస్తున్నామో చెప్పి మరీ సీఎం జగన్ ను గెలిపించుకున్నారని అంబటి పేర్కొన్నారు.
ఇవాళ అందరూ ఏపీ వైపు చూస్తున్నారంటే అందుకు కారణం సీఎం జగనే అని ఉద్ఘాటించారు. అదేసమయంలో, నాయకుడు అంటే ఇలా ఉండకూడదని చంద్రబాబు వైపు కూడా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఓట్లు వేయని వారిని కూడా తన వైపు తిప్పుకున్న నిజమైన నాయకుడు వైఎస్ జగన్ అని కీర్తించారు. జగన్ ప్రజాపాలన నేపథ్యంలో విపక్షాలు బలహీనపడగా, విపక్ష నేతలు బయటికే రావడంలేదని విమర్శించారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లో అయినా వైసీపీ జెండా ఒక్కటే ఎగిరిందని అంబటి గర్వంగా చెప్పారు. చంద్రబాబు చరిత్ర ఇక ముగిసినట్టేనని, ఆ విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు.
ఓవైపు ఏపీని కరోనా సంక్షోభం అతలాకుతలం చేసినా, సీఎం జగన్ ప్రజాసంక్షేమానికి ఏ లోటు రానివ్వలేదని, 95 శాతం హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని వెల్లడించారు. వాస్తవానికి వైసీపీ నేతలకు ఇది పండుగ సమయం అని, కానీ దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ వేడుకలకు ఇది సమయం కాదని సంయమనం పాటిస్తున్నామని అంబటి స్పష్టం చేశారు. కరోనాపై సమష్టిపోరుకు తాము కార్యోన్ముఖులం అయ్యామని, అందరూ కలిసి రావాలని అంబటి పిలుపునిచ్చారు.
సీఎం జగన్ ఏపీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు. అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.