- కేరళలో ఈ ఉదయం పేలుళ్లు
- ఒకరి మృతి… 40 మందికి గాయాలు
- సీఎం విజయన్ తో మాట్లాడిన అమిత్ షా
- కేరళకు ఎన్ఐఏ, ఎన్ ఎస్ జీ బృందాలను పంపిన కేంద్రం
కేరళలోని కలమస్సేరిలో ఈ ఉదయం పేలుళ్లు జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జంట పేలుళ్లు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. పేలుడు ఘటన, అనంతర పరిస్థితులపై సమీక్ష చేశారు. ఘటన వివరాలను సీఎం విజయన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ, ఎన్ ఎస్ జీ బృందాలను కేంద్రం కేరళకు పంపింది. ఐఈడీ పదార్థాలను టిఫిన్ బాక్సులో కూర్చి పేలుళ్లకు పాల్పడినట్టు గుర్తించారు.
కాగా, పేలుళ్లకు పాల్పడింది తానే అంటూ ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పేలుళ్లకు పాల్పడింది నిజంగానే అతడేనా అనే కోణంలో పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. అటు, కలమస్సేరి పేలుడు ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కేరళ డీజీపీ వెల్లడించారు.
కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
- వరుసగా మూడుచోట్ల పేలుడు.. ఒకరు మృతి
- పదుల సంఖ్యలో క్షతగాత్రులు
- ఆ సమయంలో 2 వేల మంది ఉన్నారన్న పోలీసులు
కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.