ఖమ్మం జిల్లాలో 14 మంది అభ్యర్థుల తిరస్కరణ …
జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ వెల్లడి ..
ఐదు నియోజకవర్గాలకు 144 నామినేషన్లు …మిగిలినవి 133 మంది అభ్యర్థులవి
జిల్లాలో నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియలో భాగంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పాత్రికేయులతో నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, స్క్రుటినీలో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 133 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఆయన తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో 40 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఇద్దరి నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. మధిర నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా, ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని వివరించారు. వైరా నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఒక అభ్యర్థి తిరస్కరణకు గురయ్యారని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థుల నామపత్రాలు చెల్లుబాటు కాగా, ముగ్గురి నామినేషన్ తిరస్కరించబడ్డాయని ఆయన అన్నారు. స్క్రూటిని ప్రక్రియ ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 15 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన అన్నారు. ఉపసంహరణ దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉండాలని, అభ్యరి నేరుగా గాని, అభ్యరి ప్రతిపాదిత వ్యక్తి గాని అందజేయవచ్చని ఆయన అన్నారు. అదేరోజు సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో గుర్తుల కేటాయింపు జరుగుతుందని ఎన్నికల అధికారి అన్నారు.