- ఆంక్షలను అతిక్రమించి కొన్ని ప్రాంతాల్లో వినిపించిన టపాసుల మోత
- గతేడాదితో పోల్చితే చాలా తక్కువగానే కనిపించిన టపాసుల సందడి
- ఆంక్షల అమలులో అధికారులు విఫలమయ్యారన్న పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి
నిషేధిత రసాయనాలతో తయారు చేసిన టపాసులపై నిషేధం విధిస్తూ నవంబర్ 7న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పలువురు ఢిల్లీ వాసులు పక్కనపెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చారు. షాపూర్ జాట్, హౌజ్ ఖాస్ ప్రాంతాల్లో క్రేకర్స్ మోత వినిపించింది. సాయంత్రం 4 గంటల తర్వాత టపాసుల మోత వినిపించిందని, అయితే గత ఏడాది కంటే చాలా తక్కువగా ఈ వాతావరణం కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. అక్కడక్కడ కొంతమంది మినహా జనాలు పెద్దగా టపాసులు కాల్చడంపై ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.
గ్రేటర్ కైలాష్, చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో రాత్రి 7.30 గంటల వరకు బాణసంచా పేలుళ్ల తీవ్రత తక్కువగానే కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో సాయంత్రం 6 గంటల నుంచి టపాసులు పేలుతున్న శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తూ పలువురు చిన్న దుకాణదారులు టపాసులు పిల్లలకు విక్రయించడం కొన్ని చోట్ల కనిపించింది. అయితే నిరుటితో పోల్చితే ఈ ఏడాది బాణసంచా పేల్చడం చాలా తక్కువని స్థానికులు చెబుతున్నారు.
ఆంక్షలు ఉన్నప్పటికీ టపాసులు కాల్చడంపై పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి స్పందించారు. తన నివాస ప్రాంతం డిఫెన్స్ కాలనీలో కూడా టపాసులు పేలినట్లు ఆమె చెప్పారు. డిఫెన్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినా ఎలాంటి మార్పు రాలేదని, బాణసంచా పొగలో సుప్రీంకోర్టు లక్ష్యం ఎగిరిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. హెచ్చరికలు, పూర్తి నిషేధం ఆంక్షలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు మరోసారి విఫలమయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు.