Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఖమ్మం జిల్లా ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పొన్నెకల్లు వద్ద శ్రీ చెతన్య ఇంజనీరింగ్ కాలేజీ …కలెక్టర్ విపి గౌతమ్

జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ గురువారం ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, పారదర్శకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేయనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి, ఇవిఎం ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా నియోజకవర్గాల నుండి ఓట్ల లెక్కింపు ఈవీఎంలు తరలించగా, జాగ్రత్తగా వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్ రూంలలోకి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్రమపద్ధతిలో అమర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేసినట్లు ఆయన అన్నారు. ఎలాంటి గందరగోళం, లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంలతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, సీపీ లు అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 లెక్కింపు టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు, ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ లు టీమ్ గా ఉంటారని, అదనంగా 20 శాతం సిబ్బందిని స్టాండ్ బై గా సిద్ధంగా ఉంచుతామని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు ఒక టీమ్ తో పాటు, ఏఆర్ఓ లు, సర్వీస్ ఓట్ల లెక్కింపుకు ఒక టీమ్ తో పాటు ఒక ఏఆర్ఓ, రిటర్నింగ్ అధికారి వద్ద ఒక టీమ్ ఉంటుందని ఆయన తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8.00 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు.

 ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, రిటర్నింగ్ అధికారులు, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు డిసిపి ప్రసాదరావు, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, ఆర్ అండ్ బి ఇఇ శ్యామప్రసాద్, ఎసిపిలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Related posts

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం!

Ram Narayana

ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ టూర్

Ram Narayana

ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేదిలా..!

Ram Narayana

Leave a Comment