కేజ్రీవాల్ పై మండిపడ్డ హర్యానా సీఎం ఖట్టర్…
-వ్యాక్సిన్ విషయంలో రాజకీయం తగదు
-అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీకే ఎక్కువ టీకాలు అందుతున్నాయి
-సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంయమనంతో వ్యవహరించాలి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మండిపడ్డారు. ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్ పై కేజ్రీవాల్ అత్యుత్సాహం చూపుతున్నారని విమర్శించారు. ప్రతిరోజు 2 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెపుతూ కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తున్నారని… తాము మాత్రం వ్యాక్సిన్ ను నిలువ ఉంచుకుని రోజుకు 50 వేల మందికి టీకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీకి ఎక్కువ వ్యాక్సిన్ అందుతోందని. చెప్పారు.
తమ ప్రభుత్వం కూడా రోజుకు 2 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగలదని… అయితే పరిస్థితుల దృష్ట్యా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోజుకు 50 నుంచి 60 వేల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నామని ఖట్టర్ తెలిపారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంయమనంతో మాట్లాడాలని సూచించారు. కరోనా కష్ట కాలంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమన్యాయం చేస్తోందని చెప్పారు. తమ రాష్ట్రంలో 2.9 కోట్ల జనాభా ఉందని… అయినప్పటికీ తాము కేవలం 58 లక్షల డోసుల టీకాను మాత్రమే అందుకుంటున్నామని అన్నారు. మాకంటే మీకే ఎక్కువ డోసుల వ్యాక్సిన్ లభిస్తోందని దుయ్యబట్టారు.
అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీనే ఎక్కువ లాభపడుతోందని ఖట్టర్ అన్నారు. సంకుచిత రాజకీయాలను విడనాడాలని హితవు పలికారు. తమ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.