- ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లు భట్టి
- ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని వ్యాఖ్య
- ఆరు గ్యారెంటీల దరఖాస్తులను ఇంటి వద్దకే వచ్చి స్వీకరిస్తున్నామని వెల్లడి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలను పొందలేకపోయారని చెప్పారు. ప్రజల కోసం ప్రజల చేత వచ్చిన ప్రభుత్వం తమదని… ప్రజాపాలన అందిస్తామని చెప్పి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
తమది దొరల పాలన కాదని మల్లు భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం ఒక వ్యక్తికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని అన్నారు. ఆరు గ్యారెంటీల ధరఖాస్తులను ఇంటి వద్దకే వచ్చి స్వీకరిస్తున్నామని… ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టామని తెలిపారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను ప్రజలకే అంకితం చేస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రజలకు ఏవైనా సలహాలు ఉంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడినీ ఎంపిక చేస్తామని తెలిపారు.