- ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే సీజన్ కావడంతో దిగిరానున్న రేట్లు
- జనవరి చివరి వారం నుంచి మార్చి రెండో వారం వరకు తక్కువ రేట్లకే టికెట్లు
- రంజాన్ సీజన్ దృష్ట్యా మార్చి రెండో వారం – ఏప్రిల్ రెండో వారం మధ్య పెరగనున్న ధరలు
యూఏఈ-ఇండియా రూట్లలో విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. జనవరి చివరి వారం నుంచి మార్చి నెల రెండో వారం మధ్య ఈ రూట్‌లో ఫ్లైట్ ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయని విమానయానరంగ నిపుణులు చెబుతున్నారు. రద్దీ తక్కువగా ఉండే ఈ సీజన్‌లో రేట్లు దిగొస్తాయని ట్రావెల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘ఈక్వేటర్’ డైరెక్టర్ సురేంద్రనాథ్ మీనన్ చెప్పారు. భారత ప్రయాణికులు ఫిబ్రవరి నెలలో తగ్గుదల ఛార్జీలతోనే ప్రయాణం చేయవచ్చునని అన్నారు. సాధారణంగా రంజాన్ సీజన్‌లో యూఏఈ-ఇండియా రూట్‌లో టికెట్ రేట్లు అధికంగా ఉంటాయి. రంజాన్ మాసం వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఉంది. ఆ సమయంలో గణనీయంగా పెరుగుదల ఉంటుంది. ఈద్ ఉల్ ఫితర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏప్రిల్ రెండవ వారం వరకు రేట్లు ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. అయితే ఫిబ్రవరిలో ప్రయాణించేవారు టికెట్ రేట్ల తగ్గుదలతో ప్రయాణం చేయవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విశ్రాంతి కోసం యూఏఈకి వెళ్లేవారు, వచ్చేవారు ఈ సీజన్‌ను ఉపయోగించుకోవచ్చు.
కీలకమైన రూట్‌లలో ఛార్జీలు ఇలా ఉండొచ్చు..
. ముంబై – దుబాయ్ ఎకానమీ టికెట్ రేట్లు సాధారణంగా 1,143 దిర్హమ్‌లు ఉంటాయి. అయితే జనవరి 2024లో 931 దిర్హమ్‌లకు తగ్గనున్నాయి. ఢిల్లీకి వెళ్లే విమానాల టికెట్ రేట్లు కూడా ఇదే విధంగా ఉండనున్నాయి.
. దక్షిణ భారత్‌లోని పలు గమ్యస్థానాలకు వచ్చే విమానాల టికెట్ రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. 1,000 దిర్హమ్‌ల కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దుబాయ్ – కొచ్చి సర్వీసుల సగటు ధర 1,355- 1,422 దిర్హమ్‌ల మధ్య ఉంటుంది. ఇది గణనీయంగా తగ్గనుంది.
. బెంగళూరు-దుబాయ్ ఛార్జీలు 1,106-,136 దిర్హమ్‌లకు తగ్గనున్నాయి.
. చెన్నై – దుబాయ్ టిక్కెట్ ధరలు జనవరి 2024 తర్వాత 931 దిర్హమ్‌లు, ఫిబ్రవరి 15 తర్వాత 854 దిర్హమ్‌లకు తగ్గనున్నాయి.
మరోవైపు భారతీయ విమానయాన సంస్థలు సీట్ల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని యూఏఈని భారత్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం 1:1 నిష్పత్తి సీటింగ్ సామర్థ్యాలతో ఇరు దేశాల ఎయిర్‌లైన్స్ విమానాలను నడుపుతుండగా 1:4 సీటింగ్ సామర్థ్యంతో తమ ఎయిర్‌లైన్స్‌కు అవకాశం ఇవ్వాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే అదనంగా సీట్లు అందుబాటులోకి వస్తాయి. భారత్‌లోని వేర్వేరు గమ్యస్థానాల నుంచి యూఏఈకి వెళ్లే విమానాల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా విమాన టికెట్లకు డిమాండ్ కాస్తే తగ్గే అవకాశం ఉంటుందని విమానయాన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.