Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ యస్ గెలవకపోతే తెలంగాణ పేరు మాయం …కేటీఆర్

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ అనే పేరు మాయం అవుతుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంగా కేసీఆర్‌ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని కొందరు చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని వివరించారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అక్కడక్కడ బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు చెప్తామని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంటులో చూడాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ నే అని చెప్పారు. దేశంలో ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కో నేత గుర్తు వస్తారని, అలా జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్‌ పేరు మాత్రమేనని అన్నారు . కేసీఆర్‌ వల్ల తెలంగాణ వచ్చింది, ఈ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని, ఈ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదని ధ్వజమెత్తారు. తెలంగాణ గురించి పార్లమెంటులో రాహుల్‌, మోదీ ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ అనే పేరు అనామకంగా అవుతుందన్నారు. తెలంగాణ డిమాండ్లను కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు లేకపోతే తెలంగాణ అనే పదమే మాయం అయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మళ్లీ మంచి అవగాహన ఏర్పడిందని, రేవంత్‌ రెడ్డిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పొగుడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

పార్లమెంట్ ఎన్నికల్లో గెలువాల్సిందేనని.. గెలిస్తేనే నిలుస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నీరుగారొద్దని.. ఆ ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే నన్నారు. భవిష్యత్ మనదేనని, మళ్లీ బలోపేతం అవుతామని ప్రభుత్వం ఫామ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ప్రారంభోపన్యాసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయగా, పార్టీ కార్యాచరణను పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు, మోసపూరిత వాగ్దానాలు, సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం, అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిందన్నారు. దరఖాస్తులు, ఎంక్వైయిరీల పేరుతో కాంగ్రెస్ డ్రామాలకు తెరదీస్తుందని మండిపడ్డారు. వరికి బోనస్, రైతు భరోసాకు ఎన్నికల కోడ్ అడ్డమా? అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయని, అందులో 2 మాత్రమేనని మహిళలకు బస్సు ఫ్రీ, 10లక్షల వరకు వైద్యం అన్నారు. మరీ మేనిఫెస్టోలో పెట్టిన 420హామీలపై ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్టీ భవిష్యత్ బాగుండాలంటే నిరాశపడొద్దని, కష్టమొస్తే అండగా ఉంటామని, పారీ నేతలను, కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. 39మంది ఎమ్మెల్యేలం ఉన్నామని అందరం వస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలోని అన్ని రంగాలను అభివృద్ధి చేశామన్నారు. పార్టీ బలోపేతానికి అందరి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో చేసిన పనులతో కూడిన ఫ్లెక్సీలు పెట్టాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మంజూరైన పనులను కాంగ్రెస్ క్యాన్సిల్ చేస్తే వాటిని సైతం మీడియా వేదికగా ప్రచారం చేయాలని, గ్రామాల్లోనూ విస్తృత ప్రచారం చేయాలన్నారు. గృహలక్ష్మి, దళితబంధు ఆపితే లబ్దిదారులకు నష్టం జరుగుతుందన్నారు. దీనిపై అవసరం అయితే కోర్టుకు వెళ్దామన్నారు. నేతలు సైతం దీనిపై నిరసన తెలపాలన్నారు. ఆటో డ్రైవర్ల మద్దతును కూడగట్టాలని సూచించారు. నేతలకు, కేడర్ మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించేందుకు సమావేశాలు నిర్వహించి భేటీ కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి కేడర్‌లో ధైర్యం నింపాలని సూచించారు. ఓడిన అభ్యర్థులు ప్రజల మధ్యనే ఉంటే సానుభూతి వస్తుందన్నారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్‌తో కాదని అర్ధమై డ్రామా చేస్తున్నారని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే అసెంబ్లీలో విచారణకు మనమే కోరామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ హామీలపై బట్టలిప్పుతామన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని దుయ్యబట్టారు. కోడ్ వచ్చిందంటే కుదరదని, రుణమాఫీ, ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లోకల్‌లో పెండింగ్ బిల్లు ఇస్తామంటే ప్రలోభాలకు గురిచేస్తే లొంగొద్దన్నారు. హామీలపై ప్రజల్లో చర్చపెట్టాలి.. బిల్లులు ఎలా ఇవ్వరో చూస్తామని.. పదిమంది న్యాయవాదులను పెట్టి విడుదల అయ్యేవరకు పోరాటం చేద్దామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమన్వయం కోసం కమిటీ వేస్తామన్నారు. బీఆర్ఎస్‌కు కొత్తశకం.. మొదటిసారి బీఆర్ఎస్ ప్రతిపక్షం పాత్ర పోషిస్తుందన్నారు.

ప్రజల ప్రేమ పొందేలా అద్బుత పాత్ర పోషిస్తామన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఆఫీసులకు తాళాలు తీస్తామన్నారు. అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేద్దామన్నామని పిలుపు నిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం జిల్లా మంత్రులకు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జిల భాద్యతలు

Ram Narayana

రేవంత్ రెడ్డీ ఇక్కడ భయపడేవాళ్లు లేరు… వెంట్రుక కూడా పీకలేవ్: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Ram Narayana

ఎన్నికల్లో మద్దతు కోరిన కిషన్ రెడ్డి.. చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment