- అయోవా ప్రైమరి ఎన్నికల్లో ప్రభావం చూపని వివేక్
- అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన
- డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వెల్లడించిన వివేక్
అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. వ్యాపారవేత్తగా అమెరికన్లకు సుపరిచితుడైన వివేక్.. గతేడాది ఫిబ్రవరిలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలతో పోటీపడ్డారు. తన ప్రసంగాలతో అమెరికన్లను ఆకట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే, మొదటి నుంచి ట్రంప్ కు వివేక్ అనుకూలంగానే ఉంటూ వచ్చారు. ట్రంప్ ప్రపంచంలోనే అత్యుత్తమ అధ్యక్షుడంటూ వివేక్ ఇటీవల కూడా పొగడ్తలు కురిపించారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉపాధ్యక్షుడిగా ఉండేందుకు సిద్ధమని తన ప్రచారంలోనూ పలుమార్లు ప్రకటించారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తాజాగా అయోవాలో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించగా వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వివేక్ రామస్వామి ఈ సందర్భంగా ప్రకటించారు.