Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ అక్రమాలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపు …

  • రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వైసీపీని సాగనంపాలన్న చంద్రబాబు
  • జగన్ ప్రజల్లో నమ్మకం కోల్పోయాడని వ్యాఖ్యలు
  • అందుకే ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నాడని విమర్శలు
  • వైసీపీ కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపు
  • కొత్త ఓట్ల నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉందని వెల్లడి
  • యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన 

టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వైసీపీని సాగనంపాలని, వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జనం నమ్మకం కోల్పోయిన జగన్, ఎన్నికల్లో చివరి అస్త్రంగా అక్రమాలనే నమ్ముకున్నారని విమర్శించారు. పూర్తిస్థాయిలో జనం మద్దతు కోల్పోయిన జగన్ ఏం చేసైనా సరే గెలవాలని తీర్మానించుకున్నాడని తెలిపారు. 

వైసీపీ కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.  5 ఏళ్ల తన పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేదని చంద్రబాబు అన్నారు. 

ఎన్నికల నిబంధనలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్దంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వివిధ కోడ్ ఉల్లంఘనలపై సీ విజిల్ అనే యాప్ ద్వారా ప్రజలే నేరుగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును సీ విజిల్ యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని అన్నారు. తద్వారా ప్రజలు కూడా పారదర్శక ఎన్నికల నిర్వహణకు తమ వంతుగా కృషి చేసినట్లు అవుతుందన్నారు. 

పౌరులు నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఈసీ వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని… ఈ కారణంగా వెంటనే ఈ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిబంధనల అమలు విషయంలో టెక్నాలజీని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. 

అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పోరాటం చేస్తున్నాయని… ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎన్నికల్లో అక్రమాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కూడా కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని… దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ రివర్స్ పాలనలో ఎక్కువ నష్టపోయింది యువతేనని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓట్ల నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉందని, అర్హులైన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ భవిష్యత్తు కోసం యువత సమర్థవంతమైన నాయకత్వాన్ని గెలిపించుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా సులభంగా ఓటు హక్కు పొందే అవకాశం ఉందని యువతకు సూచించారు. 

రాక్షస పాలన అంతంలో ప్రతి ఓటూ, ప్రతి సీటూ కీలకమని అన్నారు. యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఓటు నమోదు చేసుకుని మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Related posts

షర్మిల సవాల్ కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సై…!

Ram Narayana

పులివెందులలో జగన్ ఓటమే ధ్యేయంగా బ్రదర్ అనిల్ పావులు…!

Ram Narayana

పార్టీ ఆదేశిస్తే కడప నుంచి పోటీ చేస్తా: షర్మిల

Ram Narayana

Leave a Comment