- 25 దేశాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు
- పొరుగు దేశాలతో పాటూ ఆఫ్రికా, ఐరోపా దేశాలకు ఆహ్వానాలు పంపిన వైనం
- 15 దేశాల్లోని పార్టీల ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన
అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు, ప్రచార కార్యక్రమాలను వీక్షించేందుకు 25 దేశాల రాజకీయ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది. భారత్ పొరుగు దేశాలతో పాటూ ఆఫ్రికా, ఐరోపా దేశాల్లోని అధికార, ప్రతిపక్షాలకు ఆహ్వానాలు పంపింది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలోని పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి.
‘‘విదేశీ పార్టీలు.. అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువును వీక్షించనున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు విదేశీ పార్టీలను ఆహ్వానించాము. తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల క్రతువును వీక్షించేందుకు ఆహ్వానాలు పంపాము’’ అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం ఇంచార్జ్ డా. విజయ్ చౌతియావాలే పేర్కొన్నారు.
ఇప్పటివరకూ మొత్తం 15 దేశాల ప్రతినిధులు బీజేపీ ఆహ్వానాలకు సానుకూలంగా స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో 4, 5వ దశల పోలింగ్‌ను ఆఫ్రికా దేశాల ప్రతినిధులు వీక్షించేందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఐరోపా దేశాల పార్టీలు ఈ ఆహ్వానాలపై ఇంకా స్పందించాల్సి ఉంది. గతంలో బీజేపీ వివిధ దేశాల రాయబారులను ఎన్నికలను వీక్షించేందుకు ఆహ్వానించింది.