Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ట్విట్టర్ ,భారత్ ప్రభుత్వం మధ్య వార్ …….

ట్విట్టర్ ,భారత్ ప్రభుత్వం మధ్య వార్ …….
-ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ తొలగించి.. మ‌ళ్లీ ఇచ్చిన సంస్థ‌!
-ఆరు నెల‌లుగా ట్వీట్లు చేయ‌లేద‌ని ట్విట్ట‌ర్‌ అభ్యంత‌రం
-ట్విట్టర్​ కు కేంద్రం ఫైనల్​ వార్నింగ్​
-భారతీయ అధికారిని నియమించాలని ఆదేశం
-రూల్స్ ను పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
-అభ్యంత‌రాలు తెలిపిన ఉప రాష్ట్రప‌తి కార్యాల‌యం
-భార‌త రాజ్యాంగంపై దాడి అన్న బీజేపీ నేత‌లు
-చివ‌ర‌కు వెన‌క్కి త‌గ్గిన ట్విట్ట‌ర్‌

కొన్ని వారాలుగా కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొత్త ఐటీ చట్టంపై మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ను తొలగించిన సంస్థ.. ఆ వేడి మరింత పెరిగేలా చేసింది. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే బ్లూ టిక్ ను పునరుద్ధరించింది.

ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను ఆ సంస్థ తొలగించింది. అయితే, దీనిపై ఉపరాష్ట్రప‌తి కార్యాల‌యం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో ట్విట్ట‌ర్‌ మ‌ళ్లీ బ్లూ టిక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా ట్విట్ట‌ర్ ప‌లు ర‌కాల ఖాతాల‌కు బ్లూ టిక్‌ను ఇస్తుంది.

ఈ బ్యాడ్జి ఉండే ఆ ఖాతాలను ట్విట్ట‌ర్ ధ్రువీక‌రించింద‌ని, ఆ ఖాతాలు న‌కిలీవి కావ‌ని అర్థం. ప్ర‌భుత్వ సంస్థ‌లు, బ్రాండ్లు, లాభాపేక్ష లేని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వార్తా సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు, క్రీడాకారులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ నాయ‌కులకు బ్లూ టిక్ ఇస్తుంది.

ఇందు కోసం వారు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, త‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి ఖాతాల నుంచి ట్విట్ట‌ర్ బ్లూ టిక్ ను తొల‌గిస్తోంది. ముంద‌స్తుగా ఎటువంటి నోటీసులు, హెచ్చ‌రికా చేయ‌కుండా ఈ చ‌ర్య‌లు తీసుకుంటుంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారు ఎంత‌టి వారైనా స‌రే ఉపేక్షించ‌బోమ‌ని తెలిపేలా ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడి ఖాతా నుంచి బ్లూ టిక్ తొల‌గించింది.

సాధార‌ణంగా ఆరు నెల‌ల పాటు యాక్టివ్ గా లేని ఖాతాలు, ఉద్దేశ పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారం చేయ‌డం, పేరు మార్చుకోవ‌డం వంటి చ‌ర్య‌లకు పాల్ప‌డితే ట్విట్ట‌ర్ బ్లూ టిక్ గుర్తింపును తొల‌గిస్తుంది. వెంక‌య్య నాయుడు ఆరు నెల‌లుగా త‌న వ్య‌క్తిగ‌త ఖాతాలో పోస్ట్ లు చేయ‌డం లేదు.

ఈ కార‌ణంగానే ఆయ‌న బ్లూ టిక్‌ను తొల‌గించింది. అయితే, దీనిపై చాలా మంది నెటిజ‌న్లు మండిప‌డ్డారు. భార‌త ఉపరాష్ట్ర‌ప‌తి కార్యాలయం కూడా ట్విట్ట‌ర్‌కు అభ్యంత‌రాలు తెలిపింది. ఆరు నెల‌లుగా యాక్టివ్ గా లేని కార‌ణంగానే వెంక‌య్య నాయుడి ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను తొల‌గించార‌ని ఉపరాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం నెటిజ‌న్ల‌కు కూడా తెలిపింది.

బీజేపీ ముంబై నేత సురేశ్ నాఖువా ట్విట్ట‌ర్ చ‌ర్య‌ల‌పై మండిప‌డుతూ ఇది భార‌త రాజ్యాంగంపై చేస్తోన్న దాడిగా అభివ‌ర్ణించారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఖాతా నుంచి బ్లూ టిక్‌ను ఎందుకు తొల‌గించార‌ని ప్ర‌శ్నించారు. ట్విట్ట‌ర్‌కు, భార‌త ప్ర‌భుత్వానికి మ‌ధ్య కొన్ని రోజులుగా నిబంధ‌న‌ల విష‌యంలో విభేదాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ కూడా జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ తీసుకున్న చర్య‌పై అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. ఇన్ని అభ్యంత‌రాల మ‌ధ్య ట్విట్ట‌ర్ వెన‌క్కి త‌గ్గింది. తిరిగి వెంక‌య్యనాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతాకు బ్లూ టిక్ ను ఇచ్చింది. కాగా, ఉపరాష్ట్ర‌ప‌తి అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ఎల్ల‌ప్పుడూ యాక్టివ్ గా ఉంటుండ‌డంతో దానిపై మాత్రం ట్విట్ట‌ర్ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

ఆరెస్సెస్​ చీఫ్ మోహన్​ భగవత్​​ ఖాతా బ్లూ టిక్​ ను తీసేసిన ట్విట్టర్​

మరో నలుగురు ప్రముఖుల ఖాతాలకూ తొలగింపు
కనీస సమాచారం లేదంటున్న ఆరెస్సెస్ వర్గాలు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాలో బ్లూ టిక్ ను తొలగించిన ట్విట్టర్.. ఇప్పుడు ఆరెస్సెస్ సంస్థ మీద పడింది. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ ఖాతాకు బ్లూ టిక్ ను తీసేసింది. ఆయనతో పాటు మరో నలుగురు ఆరెస్సెస్ ప్రముఖుల ఖాతాల్లోనూ టిక్ మార్క్ ను తొలగించింది.

ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీలు కృష్ణగోపాల్, అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి, సంపర్క్ ప్రముఖ్ అనిరుధ్ దేశ్ పాండేల ట్విట్టర్ ఖాతాకు బ్లూ మార్క్ ను తొలగించింది. బ్లూ మార్క్ ను తొలగించడానికి కారణం ఖాతాలను ఎక్కువ రోజులు వాడకపోవడమే అయితే దానికి కనీసం సమాచారమైనా ఇవ్వాలి కదా? అని ఆరెస్సెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు వాడని ఖాతాలు ఎన్నో ఉన్నాయని, మరి, వారి ఖాతాలకు ఎందుకు బ్లూ టిక్ ను తీసేయట్లేదని నెటిజన్లు ట్విట్టర్ ను ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు.

ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఫైనల్ వార్నింగ్

ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ చట్టం నిబంధనల ప్రకారం భారతీయుడిని గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. వెంటనే కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసని హెచ్చరించింది.

కొత్త రూల్స్ ను పాటించకపోతే ఐటీ చట్టం 2000లోని 79 సెక్షన్ ప్రకారం అందుబాటులో ఉన్న లయబిలిటీ ఉపశమనాన్ని రద్దు చేస్తామంది. కొత్త ఐటీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం ట్విట్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ట్విట్టర్ ను నిరవధికంగా నిషేధించిన నైజీరియా

ట్విట్టర్ పై ఆఫ్రికా దేశం నైజీరియా కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నిరవధికంగా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ సమాచార శాఖ తెలిపింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అకౌంటన్ ను ట్విట్టర్ ఆపేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తమ రూల్స్ ను ముహమ్మదు అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. సాక్షాత్తు అధ్యక్షుడి ఖాతానే స్తంభింపజేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఫైర్ అయింది. ఇటీవలి కాలంలో ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది ప్రముఖులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. తాజాగా మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఖాాతాకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తగానే వెంటనే తప్పును సరిదిద్దుకుంది.

 

Related posts

హిందూమతాన్ని స్వీకరించిన ఇండోనేషియా మాజీ అధ్యక్షుడి కుమార్తె!

Drukpadam

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహజ్వాలలు…సీఎల్పీ నేతను కలిసిన సీనియర్లు …

Drukpadam

“ముద్ర” మీడియా రంగంలో సరికొత్త ముద్ర వేయాలి …సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి …

Drukpadam

Leave a Comment