- ఆఫ్రికా దేశాల్లో అధికంగా మహిళా మేనేజర్లు
- బర్కీనో ఫాసో, నైజీరియా, జమైకా దేశాల్లో 60 శాతానికి పైగా మేనేజర్లు మహిళలే
- మహిళలకే పరిమితమైనవిగా పేరుపడ్డ రంగాల్లో పెరిగిన మేనేజర్ల సంఖ్య
- కార్పొరేట్ కంపెనీల్లో, ప్రభుత్వ ఉన్నతస్థానాల్లో కానరాని స్త్రీపురుష సమానత్వం
అనేక జీవన ప్రమాణాల్లో వెనకబడ్డవిగా ఆఫ్రికా దేశాలు అపప్రధ మూటగట్టుకున్నాయి. స్త్రీ పురుష సమానత్వం, మహిళా సాధికారతలోనూ దిగదుడుపుగానే ఉన్నాయి. కానీ, ఆ దేశాల్లోనే మేనేజర్లుగా మహిళలే ఎక్కువ మంది ఉన్నట్టు తాజా సర్వేలో బయటపడింది. ఆయా దేశాల్లో పనిచేస్తున్న వారికి మహిళలు బాస్‌లుగా ఉండే అవకాశాలు ఎక్కువని తేలింది. ముఖ్యంగా బర్కీనో ఫాసో, నైజీరియా, జమైకా దేశాల్లో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
2022-23 డేటా ప్రకారం, బర్కీనో ఫాసో, నైజీరియాల్లో 67 నుంచి 70 శాతం మేనేజర్లు మహిళలే. జమైకా, బొత్సవానాలో ఈ సంఖ్య వరుసగా 60 శాతం, 52 శాతంగా ఉంది. మహిళా మేనేజర్లు అధికంగా ఉన్న దేశాల్లో ఫిలిప్పీన్స్, కరీబియన్ దేశాలు, సెయింట్ లూషియా, జాంబియా కూడా ఉన్నాయి. మహిళా మేనేజర్ల సంఖ్యాపరంగా ఈ దేశాలు టాప్‌లో ఉన్నప్పటికీ అవకాశాల పరంగా స్త్రీపురుష సమానత్వం సాధించలేదని తాజాగా గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
నిపుణుల ప్రకారం, ఆఫ్రికా దేశాల్లో అనేక మంది మహిళలు బతుకుతెరువు కోసం వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లు అంతగా అభివృద్ధి కాకపోవడంతో మహిళా వ్యాపారులు తమ నిధులు తామే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఫలితంగా అక్కడ మహిళా మేనేజర్ల సంఖ్య పెరుగుతోంది. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనవిగా పేరుపడ్డ మానవవనరులు, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రజాసంబంధాలు తదితర వ్యాపార అనుబంధ రంగాల్లో మహిళలు కుదురుకుంటున్నారు.
ఈ పరిణామాలు మహిళా సాధికారతకు చిహ్నాలు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో, ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఇప్పటికీ మహిళల సంఖ్య తక్కువేనని చెబుతున్నారు.
ఇక మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో మహిళా మేనేజర్లు 15 శాతమే అయినా జోర్డాన్‌లో మాత్రం వీరి సంఖ్య అధికం. జోర్డాన్‌లో మహిళకు మాత్రమే ప్రత్యేకమైన రంగాల్లో స్త్రీల పాత్ర అధికమవడమే ఇందుకు కారణమని తేలింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం, జోర్డాన్‌లోని స్కూళ్లల్లో మహిళా ప్రిన్సిపాళ్ల సంఖ్య అధికం. ఇక తూర్పు అమెరికాలో మహిళా మేనేజర్ల శాతం 42 కాగా, ఉత్తర అమెరికాలో 40 శాతం. దక్షిణాసియాలో 39 శాతం మంది కాగా, ఉత్తరయూరప్‌లో 38 శాతం మంది మహిళా మేనేజర్లు ఉన్నారు.
ఇక మహిళా మేనేజర్లు అల్పంగా ఉన్న దేశాల్లో మొరొక్కో (12.4 శాతం), ఖతర్ (13.8 శాతం), ఈజిప్ట్ (14 శాతం), బంగ్లాదేశ్ (7.3 శాతం), ఇండియా (12.6 శాతం) ఉన్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళా మేనేజర్ల శాతం వరుసగా 14.6 శాతం, 16.3 శాతానికి పరిమితం కావడం కాస్తంత ఆశ్చర్యం కలిగించేదే. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికాల్లో లాగా మహిళలు కొన్ని రంగాలకే పరిమితం కావాలన్న భావన మహిళల సాధికారతకు అడ్డంకిగా మారిందని నిపుణులు చెబుతున్నారు.