- పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాల్సిందన్న సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం చెప్పిన ఈడీ
- రాజకీయ నాయకులైనంత మాత్రనా కేసులో మినహాయింపులుండవన్న ఈడీ
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో నిందితుడిగా తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది. మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన సుప్రీం కోర్టు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కు కీలక సూచన చేసింది. ఈ కేసులో బెయిల్ గనుక ఇస్తే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు నిర్వర్తించవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయలేదు. లోక్ సభ ఎన్నికల వేళ ఒక పార్టీ నేతగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే బెయిల్ మంజూరు చేస్తే గనుక ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు మాత్రం నిర్వర్తించరాదని సుప్రీం కో ర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించింది.
మధ్యంతర బెయిల్ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ‘‘అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని, లోక్ సభ ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని ఈ సమయంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సి అవసరం ఉందని’’ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఇందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్ర అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని తెలిపింది. రాజకీయనేతలకు మినహాయింపులు ఉండకూడదని, ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు అసలు సహకరించలేదని ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ దశలో ఆయనకు బెయిల్ ఇస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈ డీ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ మీరు బెయిల్ ఇస్తే ఆయన సీఎం పదవీ బాధ్యతలు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ఈడీ తెలిపింది. అందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ…కేజ్రీవాల్ ఎలాంటి ముఖ్యమైన పత్రాలపైనా సంతకాలు చేయరని, ఆకారణంతో లెఫ్టెనెంట్ గవర్నర్ ఆ పత్రాలను తిరస్కరించకుండా చూడాలని కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది.