- అమెరికాలోని మోంటానాలో ఉన్న రో నదికి ఎంతో ప్రత్యేకత
- జెయింట్ స్ప్రింగ్స్, మిస్సౌరీ నది మధ్య 201 అడుగుల దూరం వరకే ప్రవాహం
- 1989లోనే గిన్నిస్ బుక్ లో చోటు
ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నది ఏది? అని అడిగితే చాలా మంది టక్కున అమెజాన్ లేదా నైల్ పేరు చెబుతారు. మరి ప్రపంచంలోకెల్లా అతిపొట్టి నది పేరు చెప్పండి అంటే.. నదుల్లో పొట్టివి కూడా ఉంటాయా అని అవాక్కవుతున్నారా? నిజంగానే ఉన్నాయి మరి..! అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది! జెయింట్ స్ప్రింగ్స్, మిస్సౌరీ నది మధ్య జస్ట్ 61 మీటర్ల దూరం వరకే దీని ప్రవాహం సాగుతుంది. అందుకే 1989లోనే ఈ నది గిన్నిస్ బుక్ లోకి ఎక్కేసింది.
అంతకుముందు ఈ రికార్డు అమెరికాలోని ఓరెగావ్ రాష్ట్రంలో ఉన్న లింకన్ సిటీలో డీ రివర్ పేరిట ఉండేది. దాని పొడవు 440 అడుగులే. అంటే 134 మీటర్లు అన్నమాట. అయితే రికార్డు తమ నదికే చెందాలంటూ ఇరు ప్రాంతాల వారు పట్టబట్టడంతో 2006లో గిన్నిస్ నిర్వాహకులు ఈ కేటగిరీనే ఎత్తేశారట.
కానీ వరల్డ్ అట్లాస్ ప్రకారం రో నదికన్నా చిన్నవైన మరో రెండు నదులు కూడా ఉండటం విశేషం. ఇండోనేసియాలోని తాంబొరాసి నదితోపాటు నార్వేలోని కోవస్సెల్వా నది పొడవు కూడా అత్యల్పంగా 65.6 అడుగులే! అంటే అవి కేవలం 20 మీటర్ల దూరమే ప్రవహిస్తాయట!
కానీ నిజంగా ఒక నది కేవలం 65 అడుగుల దూరం వరకే ప్రవహిస్తుందా? అనే డౌట్ అందరిలోనూ వస్తుంది. అయితే అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఒక నది అంటే దానిలో నిరంతర ప్రవాహం ఉండాలి. అందులోని నీరు సముద్రంలో లేదా మరో నదిలో లేదా చెరువులో లేదా పరీవాహకంలో కలవాలి. సాధారణంగా వాగులు, వంకలు కలసి సెలయేళ్లుగా ప్రవహిస్తాయి. సెలయేళ్లన్నీ కలిసి నదులుగా మారతాయి. చివరకు నదులన్నీ ఎత్తయిన ప్రదేశాల నుంచి దిగువకు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి.