- 1950-2015 మధ్య కాలంలో దేశ జాభాలో 7.8 శాతం తగ్గిన హిందువుల వాటా
- పార్సీలు, జైనులు మినహా ఇతర మైనారిటీల వాటా పెరిగిన వైనం
- పాక్‌లో పెరిగిన మెజారిటీ మతస్తుల వాటా
- శ్రీలంక, భూటాన్‌ల్లో పెరిగిన బౌద్ధుల సంఖ్య
- ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో వెల్లడి
దేశ జనాభాలో మెజారిటీ మతస్తులుగా ఉన్న హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ) నేతృత్వంలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. పోరుగు దేశాల్లో మాత్రం మెజారిటీ మతస్తుల సంఖ్య పెరిగినట్టు పీఎమ్- ఈఏసీ తేల్చింది.
పీఎమ్- ఈఏసీ అధ్యయనం ప్రకారం, 1950-2015 మధ్య కాలంలో భారత్‌లో మెజారిటీ మతస్తులైన హిందువుల జనాభా వాటా 7.8 శాతం మేర తగ్గింది. అదే సమయంలో మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కుల వాటా పెరిగింది. అయితే, మైనారిటీలైన జైనులు, పార్సీల సంఖ్య మాత్రం తగ్గింది. ఈ సర్వే ప్రకారం, గత 65 ఏళ్లల్లో దేశ జనాభాలో హిందువుల వాటా 84 శాతం నుంచి 78 శాతానికి పడిపోయింది. ముస్లింల వాటా 9.84 శాతం నుంచి 14.09 శాతం పెరిగింది. సంఖ్యాపరంగా మెజారిటీ మతస్తుల వాటా తగ్గుదలలో మయాన్మార్ (10 శాతం) తరువాతి స్థానంలో భారత్ ఉంది. నేపాల్‌లో కూడా మెజారిటీ మతస్తులైన హిందువుల వాటా 3.6 శాతం మేర తగ్గింది.
భారత్‌లో పోలిస్తే పొరుగు దేశాల్లో భిన్నమైన జనాభా మార్పులు జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది. పాకిస్థాన్‌లో మెజారిటీ మతస్తుల (హనాఫీ ముస్లింలు) వాటా 3.75 శాతం పెరిగింది. బాంగ్లాదేశ్ జనాభాలో ముస్లింల వాటా అత్యధికంగా 18.5 శాతం పెరిగింది. బౌద్ధం ప్రధానమతంగా ఉన్న శ్రీలంక, భూటాన్ దేశాల్లో మెజారిటీ మతస్తుల వాటా వరుసగా 17.6 శాతం, 5.25 శాతం మేర పెరిగింది. ఈ అధ్యయనంలో మొత్తం 167 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారత జనాభాలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సరిళికి అనుగుణంగానే ఉన్నాయని అధ్యయనకారులు పేర్కొన్నారు.