విజయవాడలో మాయలేడి టోకరా ….నిండా మునిగిన సెల్ ఫోన్ యజమాని !
-విషయం తెలిసి లబోదిబో
-శ్రీదివ్య అనే యువతిపై కేసు నమోదు
-ఫిర్యాదు చేసిన ఓ సెల్ ఫోన్ దుకాణం యజమాని
-రూ.80 లక్షల మేర మోసగించిందని ఫిర్యాదు
-న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన వైనం
విజయవాడలో ఓ యువతి సెల్ ఫోన్ యజమానిని ఒక మాయలేడి టోకరా వేసిన వైనం వెలుగు చూసింది. కన్సల్టెంట్ పేరుతో రూ.80 లక్షల మేర మోసగించిన వైనం వెల్లడైంది. శ్రీదివ్య అనే యువతి ఈ ఛీటింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. తనకు రూ.1.5 కోట్ల విలువ చేసే పొలం ఉందని శివకృష్ణ అనే సెల్ ఫోన్ దుకాణం యజమానితో చెప్పిన శ్రీదివ్య… ఆ పొలం రూ.80 లక్షలకు తాకట్టులో ఉందని అతడిని నమ్మించింది. తనను తాను ఓ కన్సల్టెంట్ గా పరిచయం చేసుకుంది.
తాకట్టు నుంచి విడిపిస్తే పొలాన్ని అధిక లాభాలకు విక్రయించవచ్చని ఆ సెల్ ఫోన్ దుకాణదారును ప్రలోభానికి గురిచేసింది. తన పొలాన్ని తాకట్టు నుంచి విడిపించమని కోరింది. ఈ క్రమంలో శివకృష్ణ పలు విడతలుగా శ్రీదివ్యకు రూ.80 లక్షలు ఇచ్చాడు. అయితే ఆమె పొలం అమ్మకంపై ఎంతకీ స్పందించకపోవడంతో తాను మోసపోయానని శివకృష్ణ గ్రహించాడు. శ్రీదివ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీసులు శ్రీదివ్యపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా, శ్రీదివ్య ప్రేమ, పెళ్లి పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.