ఇప్పుడు ఆస్తి పన్నులు పెంచడం ఏమిటి …ప్రజలు భాదల్లో ఉన్నారు: సీపీఐ రామకృష్ణ
కరోనా సంక్షోభ సమయంలో ఆస్తి పన్ను పెంచుతారా?
పన్నులు పెంచుతూ జీవోలు
జీవోలను వెనక్కి తీసుకోవాలన్న రామకృష్ణ
పన్నుల పెంపు ప్రజలపై భారం మోపుతుందని వెల్లడి
పన్నుల పెంపుపై ప్రజాసంఘాల ఆగ్రహం
ఏపీ లో ఆస్తి పన్నులు పెంచడం వివాదాస్పదంగా మారుతుంది. జగన్ సర్కార్ కరోనా సమయంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని చెబుతూ బారాలు వేయడం మేలు చేయడమా ?అని సిపిఐ ప్రశ్నించింది. ఆస్తిపన్ను పెంపుపై స్పందిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలో పన్నులు పెంపు సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర సమయంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపు ప్రజలకు గుదిబండ వంటిదని పేర్కొన్నారు. పన్ను పెంచుతూ జారీ చేసిన 197, 198 జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పన్ను పెంపును నిరసిస్తూ ఈ నెల 8, 9వ తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
అటు, పలు ప్రజాసంఘాలు కూడా ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరల పెంపుతో సతమతమవుతున్న సమయంలో, పన్నులు పెంచడం సరికాదని నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.